మోర్తాడ్, జూలై 27: వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో వారికి ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం పెంపొందించడానికి ప్రభుత్వం సమ్మర్ క్యాంపు (వేసవి శిబిరం) మే నెలలో నిర్వహించింది. ఈ శిబిరాల నిర్వహణకు రూ.16.50 లక్షల వరకు ఖర్చువుతుందని అధికారులు నిర్ణయించారు. అయితే వేసవి శిబిరం ముగిసి రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో సమ్మర్‌క్యాంపు నిర్వహణలో స్నాక్స్ అందించిన వారితోపాటు విద్యార్థులకు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి కృషి చేసిన వారికి రావాల్సిన పారితోషికం(వేతనాలు) అందక ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాకు కేటాయించిన నిధులను మంజూరుచేయాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో వేసవి శిబిరాలను మే 10 నుంచి 24 వరకు నిర్వహించారు. ఈ శిబిరాలకు మొత్తం 2,393 విద్యార్థులు హాజరయ్యారు. సమ్మర్క్యాంపులో విద్యార్థులకు ట్యూటర్కు రెమ్యునరేషన్ రూ.3వేలు, ప్రతిరోజూ స్నాక్స్ కోసం రూ.15 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ప్రతి మండలానికి రూ.50వేల వరకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఒక మండలంలో వంద మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించింది. శిబిరానికి హాజరైన విద్యార్థులకు రోజుకో రకం అల్పాహారం (పల్లీలు, పోహ, ఉప్మా, సిమెన్రైస్) అందించారు.
శిబిరంలో డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, కరాటే, డాన్స్ క్లాసులను నిర్వహించారు. ఒక్కో క్లాసు ఒక్కోగంటపాటు ట్యూటర్లను నియమించారు. ఒక్కో ట్యూటర్కు 15రోజులకు రూ.3వేలు చెల్లించాలని నిర్ణయించారు. ఇలా 32 జిల్లాలో నిర్వహించిన వేసవి శిబిరాలకు మొత్తం 2,393 విద్యార్థులు హాజరయ్యారు. ఈ శిబిరాల నిర్వహణకు సంబంధించి జిల్లాకు రూ.13లక్షల 7వేల 725 నిధులు రావాల్సి ఉంది. సమ్మర్‌క్యాంపు ముగిసి రెండునెలలు కావస్తున్నా, నిధులు రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమ్మర్‌క్యాంప్ కోర్సు డైరెక్టర్ గా ఎంఈవో(మండల విద్యాధికారులు)లను నియమించారు. దీంతో ఈ క్యాంప్ నిర్వహణకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వారికి భారంగా మారింది. క్యాంప్‌లో విద్యార్థులకు స్నాక్స్ ఇచ్చిన వారు, వివిధ రంగాల్లో శిక్షణను ఇచ్చిన ట్యూటర్లు తమకు రావాల్సిన రెమ్యునరేషన్ గురించి తరచూ ఎంఈవోలను అడగడంతో గత్యంతరం లేక చాలా మండలాల్లో ఎంఈవోలు తమ సొంతడబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం సమ్మర్క్యాంప్నకు సంబంధించిన నిధులు కేటాయించినపుడు తీసుకుంటామని, ఇప్పటికైతే వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తమ సొంత డబ్బులను ట్యూటర్లు, స్నాక్స్ అందించిన వారికి చెల్లించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సమ్మర్క్యాంపునకు సంబంధించిన నిధులను కేటాయించాలని కోరుతున్నారు.
సమ్మర్‌క్యాంపు నిర్వహణకు సంబంధించి ఇవ్వాల్సిన వారికి నా సొంత డబ్బులు ఇచ్చాను. స్నాక్స్ అందజేసినవారితోపాటు ట్యూటర్లకు డబ్బులు చెల్లించాను. డబ్బులు ఇంకెప్పుడస్తాయి ఎప్పుడిస్తారు అని తరచూ అడగడం, వారు పడుతున్న బాధను చూడలేక నా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు సమ్మర్‌క్యాంప్ కోసం వెచ్చించిన డబ్బులు తీసుకుంటాను.