చందూర్, మార్చి 11: మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇలాకాలోని ఓ చెరువు కోసం రెండు గ్రామాలు కొట్లాటకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం అర్ధరాత్రి మొదలైన వివాదం మంగళవారం సాయంత్రం దాకా కొనసాగింది. చివరకు అధికారులు, పోలీసులు సర్దిచెప్పడంతో ప్రస్తుతానికి పరిస్థితి సద్దిమణిగింది. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని లక్ష్మీసాగర్ చెరువుపై లక్ష్మాపూర్ గ్రామస్తులకు 60 శాతం, లక్ష్మీసాగర్ తండా(మేడ్‌పల్లి) వాసులకు 40 శాతం వాటా ఉన్నది. అయితే, సోమవారం రాత్రివేళ లక్ష్మీసాగర్ తండా వాసులు కొందరు చెరువులో చేపలు పడుతుండగా, లక్ష్మాపూర్ గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ క్రమంలో ఇరు గ్రామాల మధ్య వివాదం రాజుకోగా, పోలీసులు రంగప్రవేశం చేశారు. లక్ష్మాపూర్ గ్రామస్తులు తెల్లవారుజాము 4.30 గంటల వరకు ఆందోళన చేయగా పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించారు.
ఆ తర్వాత గ్రామస్తులంతా కలిసి చందూర్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలికి వచ్చి బైఠాయించారు. గంటన్నరకు పైగా రాస్తారోకో చేయడంతో రాకపోకలు నిలిచి పోయాయి. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని గ్రామంలో మాట్లాడుకుందామని చెప్పి వారిని సముదాయించారు. అనంతరం లక్ష్మాపూర్‌కు వెళ్లి స్థానికులతో సమావేశమయ్యారు. అదే సమయంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి అక్కడకు చేరుకున్నారు. రెండు గ్రామాల మధ్య నెలకొన్న చెరువు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, అప్పటిదాకా ఎవరూ చెరువు వైపు వెళ్లి సమస్యలు సృష్టించ వద్దని రెండు గ్రామాల ప్రజలకు స్పష్టం చేశారు. అనంతరం చెరువులో అక్రమంగా పట్టిన చేపలను అధికారుల సమక్షంలో వేలం వేశారు.