నవీపేట/నిజాంసాగర్, మే 3: ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. నవీపేట మండలంలోని మోకన్‌పల్లి గ్రామానికి చెందిన బంగారు సాయిలు(58), మహ్మద్‌నగర్ మండలం దూప్‌సింగ్ తండాకు చెందిన బోడ నర్ల(56) వడదెబ్బకు గురై మృతి చెందారు. నవీపేట మండలంలోని మోకన్‌పల్లి గ్రామానికి చెందిన బంగారు సాయిలు భిక్షాటన చేస్తూ కుటుంబ సభ్యులను పోషిస్తున్నాడు. శుక్రవారం భిక్షాటన చేసేందుకు నిజామాబాద్ వెళ్లగా వాంతులు, విరేచనాలయ్యాయి. బంధువులు వెంటనే జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతిచెందాడు. సాయిలుకు నలుగురు కూతుళ్లు ఉన్నారు.
మహ్మద్‌నగర్ మండలం దూప్‌సింగ్ తండాకు చెందిన బోడ నర్ల మూడు రోజుల క్రితం ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఓ పనిమీద ఎల్లారెడ్డికి వెళ్లి తిరిగి రాగా వాంతులు, విరేచనాలు చేసుకున్నాడు. కుటుంబీకులు వెంటనే బాన్సువాడ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య శాంతాబాయి, ఒక కొడుకు, కూతురు ఉన్నారు.