బాన్సువాడ(నిజాంసాగర్), జూలై 7 : ఎంతోమంది ప్రతిభావంతులను అందించిన నిజాంసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నేడు ఆదరణ కరువైంది. అడ్మిషన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలని మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నిజాంసాగర్‌లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని అదనపు తరగతి గదుల్లో కళాశాలను ప్రారంభించారు. గతేడాది కళాశాలలో విద్యార్థులకు విద్యాబోధన అందించే అధ్యాపకుల సంఖ్య తక్కువగా ఉండడంతోపాటు వారంలో మూడు, నాలుగు రోజులు ఇతరాత్ర కళాశాలలో పనిచేసే అధ్యాపకులతో బోధన అందించారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు చేపట్టారు.
అన్ని గ్రూపుల్లో కలిసి కేవలం 13 మంది మాత్రమే అడ్మిషన్ పొందారు. వారిలో పరీక్షల నాటికి కేవలం ఐదుగురు మాత్రమే పరీక్షఫీజు చెల్లించగా, ముగ్గురు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది కళాశాలలో అధ్యాపకులను భర్తీ చేయడంతో ప్రస్తుతం 10 మందితో కళాశాల కొనసాగుతున్నది. 2024-25లో ప్రథమ సంవత్సరంలో జూన్ 30 నాటికి ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీలో కలిపి 45 మంది, ద్వితీయ సంవత్సరంలో 13 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారని అధ్యాపకులు తెలిపారు. ఇతర కళాశాలల్లో అడ్మిషన్ పొంది ఈ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు మరో ఐదుగురు ఉన్నారని పేర్కొన్నారు.
ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంటర్ బోర్డు నిజాంసాగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించింది. అయినప్పటికీ అరకొర వసతులు, సరిపడాలేని అధ్యాపకులతో కళాశాలను కొనసాగించారు. ఈ సంవత్సరం అధ్యాపకులను భర్తీ చేశారు. నాణ్యమైన విద్యను అభ్యసించాలంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని అధ్యాపకులు చెబుతున్నారు. ఇప్పటికే 45పైగా విద్యార్థుల అడ్మిషన్లు జరిగాయని, ఇంకా ఆన్లైన్లో మరికొంత మంది విద్యార్థులు త్వరలోనే అడ్మిషన్లు తీసుకోనున్నట్లు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఫారుఖ్ హుస్సేన్ తెలిపారు.
పేద, మధ్య తరగతి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అభ్యసించేందుకు మంచి అవకాశం. నిజాంసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం రెట్టింపు స్థాయిలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. కళాశాలలో పది మంది అధ్యాపకులు ఉన్నారు. మిగిలిన ఇద్దరు అధ్యాపకులను భర్తీచేసేలా కృషి చేస్తాం. అన్ని సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు ఉన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.