వినాయక్ నగర్, అక్టోబర్,04 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమీప బంధువులైన ఇద్దరు యువకుల మధ్య మద్యం తాగిన అనంతరం జరిగిన ఘర్షణలో ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ యువకుడికి కత్తిపోట్లు కాగా మరో యువకుడు గాయాల పాలయ్యాడు. నిజామాబాద్ రూరల్ ఎస్ఐ మహ్మద్ ఆరిఫ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఆకాష్, మాణిక్ అనే ఇద్దరు యువకులు కలిసి శనివారం రాత్రి ఓ చోట మద్యం సేవించారు. అనంతరం వీరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ ఘర్షణలో ఆకాష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇంటికి తిరిగి వచ్చిన ఆకాష్ ముఖంపై గాయాలు చూసి అతని తమ్ముడు, కుటుంబ సభ్యులు ఏం జరిగిందని ప్రశ్నించి వారందరూ కలిసి మాణిక్ ఇంటికి వెళ్లారు. మాణిక్ ఇంటికి వెళ్లి అతని నిలదీయడంతో ఆగ్రహంతో మళ్లీ ఇంట్లోంచి కత్తి తీసుకొని ఆకాష్ తలపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆకాష్ తలపై గాయమయ్యింది. దీంతో అక్కడే ఉన్న ఆకాష్ తమ్ముడు అరుణ్ మాణిక్ పై దాడి చేశాడు. దీంతో మాణిక్‌కు సైతం గాయమైంది. ఇరువురిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు. ఇరుపక్షాల వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.