ఆర్మూర్‌టౌన్, మే 14: ఆర్మూర్ మండలంలోని చేపూర్ శివారులో ఉన్న 63వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. డీసీఎం వ్యాన్, బైక్‌ను ఢీ కొట్టడంతో ఆర్మూర్పట్టణానికి చెందిన అన్నదమ్ములు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ పట్టణం జెమ్మన్జెట్టికి చెందిన కొండూర్ అర్జున్(21), కొండూర్ నాగేంద్ర (19) అన్నదమ్ములు. ఇద్దరూ హైదరాబాద్‌లో ఉంటూ అర్జున్ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తుండగా, నాగేంద్ర హోటల్ మెనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు.
నెలరోజుల క్రితం ఇద్దరు ఇంటికి వచ్చిన వారు మంగళవారం మెట్పల్లిలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. బుధవారం తిరిగి వస్తుండగా ఆర్మూర్ మండలంలోని చేపూర్ శివారులో ఉన్న 63వ జాతీయ రహదారిపై డీసీఎం వ్యాన్, వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.