కామారెడ్డి, ఏప్రిల్ 10 : కామారెడ్డిలో విషాదం నెలకొన్నది. ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి మండలం క్యాంసంపల్లి తండాలో చోటుచేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాసంపల్లి తండాకు చెందిన తేజావత్ రాజీ- రవి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు దుబాయ్‌లో ఉండగా చిన్న కుమారుడు తేజావత్ సాయికుమార్ (16) క్యాటరింగ్, ముత్యంపేట్లోని కల్లు దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ నెల 8న ఉదయం సాయికుమార్, తేజావత్ రాజీ ఆడబిడ్డ కుమారుడు భుక్యా సురేశ్ (15)తో కలిసి బయటికి వెళ్లారు.
రాత్రయినా ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో చుట్టపక్కల, బంధువుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం రాఘవపూర్ శివారులోని నర్సారెడ్డి కుంటలో రెండు మృతదేహాలు బయటపడగా..కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా తేజావత్ సాయికుమార్, భుక్యా సురేశ్‌గా గుర్తించారు. స్నానం చేయడానికి వెళ్లి ఈతరాకపోవడంతో నీట మునిగి చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యా ప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు
తెలిపారు.