కంఠేశ్వర్, ఫిబ్రవరి 15: తమను దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ హమాలీలు రోడ్డెక్కారు. రెండు గంటల పాటు ధర్నా చేశారు. దీంతో మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. కొన్ని రోజులుగా మార్కెట్ కమిటీ పాలకవర్గానికి, కార్మికులకు మధ్య నెలకొన్న విభేదాలు శనివారం రోడ్డున పడ్డాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డికి వ్యతిరేకంగా హమాలీలు ఆందోళన చేపట్టడం తీవ్ర దుమారం రేపింది.
తమపై దొంగతనం ఆరోపణ మోపడం సరికాదని, చైర్మన్ వచ్చి మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీకి వచ్చిన రైతును పంట తూకం వేసి సంతోషంగా ఇంటికి పంపించే తమపై చోరీ మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ పాలకవర్గంలోని పలువురు మార్కెట్ యార్డును అభాసు పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమను దొంగలుగా చిత్రీకరించిన వ్యక్తులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ రాత్రి రెండు గంటల సమయంలో మార్కెట్ కమిటీని సందర్శిస్తున్నారని.. ఇప్పటి వరకు ఎంతమంది దొంగలను పట్టుకున్నారో చెప్పాలన్నారు. అనంతరం కార్మికులతో మాట్లాడానికి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డిని కార్మికులు ముట్టడించారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న కార్మికులు సెక్యూరిటీ ఇన్చార్జి శ్రీనివాస్‌పై దాడిచేశారు. పోలీసులు అతడిని తమ వాహనంలో అక్కడి నుంచి తరలించారు. మధ్యాహ్నం నుంచి పసుపు విక్రయాలు కొనసాగాయి.
ఎండకన, వాననక రైతులకు సేవ చేస్తున్నం. అలాంటి మమ్మల్ని కొందరు ఇలా దొంగలుగా చిత్రీకరించడం చాలా బాధాకరం.
-శ్రీనివాస్, గుమాస్తా
కార్మికులపై దొంగతనం మోపడం సరికాదు. మార్కెట్ యార్డులోని ప్రతి కార్మికుడూ.. రైతులకు సాయం చేయడంలో ముందుంటాడు.
-శ్రీహరి, హమాలీ యూనియన్ కార్యదర్శి
పాలకవర్గంలోని పలువురు సభ్యులు.. కార్మికులను, మార్కెట్ యార్డును బద్నాం చేయాలని చూస్తున్నరు. చోరీ జరిగితే బయటపెట్టాలి. ఈ విషయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ స్పందించాలి.
-శ్రీనివాస్‌గౌడ్, దడ్వాయి యూనియన్ అధ్యక్షుడు