కంటేశ్వర్, ఫిబ్రవరి 18 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ కార్యాలయం ఎదుట మంగళవారం పసుపు రైతులు(Turmeric farmers )ఆందోళన చేపట్టారు. పసుపుకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. దళారులు రైతులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ సిబ్బంది వ్యాపారులకు తొత్తుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ యార్డులో మార్కెటింగ్ డైరెక్ట్ పర్చేసింగ్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడమే రైతులను మోసం చేయడానికి ఇదే నిదర్శమన్నారు.
పసుపు సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా కూడా సెంటర్ ఎందుకు ప్రారంభించలేదని రైతులు ప్రశ్నించారు. మార్కెట్ యార్డుకు పసుపు తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా కూడా పసుపు కొనడం లేదని, కొందరు రైతులు దిక్కుతోచక వ్యాపారులు చెప్పిన రేటుకు పసుపు విక్రయించి కన్నీటితో తిరిగి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లపై అధికారులను సంప్రదిస్తే నిర్లక్ష్యంగా సమాధానిమిస్తున్నారని వాపోయారు.
పసుపు మద్దతు ధర విషయమై పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని కలిస్తే నాకేమీ తెలియదు, మార్కెట్ కమిటీ చైర్మన్తో మాట్లాడాలని తప్పించుకుంటున్నారని రైతులు తెలిపారుఉ. పసుపు కనీసం మద్దతు ధర రూ.15000 చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇదే విషయంపై మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ వివరణ కోరగా.. డైరెక్ట్ పర్చేసింగ్ సెంటర్ను నేడు లేదా రేపు ఏర్పాటు చేస్తామని సెక్రటరీ చెప్పడం గమనార్హం. ఆందోళన కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.