పసుపు రైతుల పరిస్థితి దయానీయంగా తయారైంది. తొమ్మిది నెలలు కష్టపడి పండించిన పంటపై దుంపకుళ్లు దాడి చేసింది. కొమ్ము సాగే క్రమంలో తెగులు సోకడం కారణంగా దిగుబడి అమాంతం పడిపోయింది. ఇక మార్కెట్‌కు వస్తే గిట్టుబాటు ధర కరువైంది. దీంతో పసుపు రైతాంగం ఆందోళన చెందుతున్నది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు వారం రోజుల నుంచి పసుపు రాక ప్రారంభం కాగా, ధర అంతంత మాత్రమే పలుకుతున్నది. ఓ వైపు ఉత్పత్తి తగ్గి, ఖర్చులు పెరిగి ఎనలేని భారం మోస్తున్న అన్నదాతలకు ప్రస్తుతం పలుకుతున్న ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పసుపుబోర్డు ఏర్పాటు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలెవ్వరూ పసుపు రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదు.
నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి పసుపు రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు వస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో రేట్లు లేక ఉసూరుమంటున్నారు. గిట్టుబాటు ధర కోసం నిరీక్షణ చేయలేక మధ్యవర్తులు ఇచ్చే ధరకే పంటను అమ్ముకుని తిరుగుముఖం పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. సంక్రాంతి రోజున హడావుడిగా పసుపుబోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించి, గంటల వ్యవధిలోనే ప్రైవేట్ హోటల్లో ప్రారంభోత్సవం చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు. నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశామంటున్న పసుపుబోర్డు, ఆ సంస్థ చైర్మన్ పల్లె గంగారెడ్డి సైతం ఇంత వరకూ పసుపు రైతుల దుస్థితిపై నోరు విప్పలేదు. మద్దతు ధర అంశంపై మాట్లాడనే లేదు.
-నిజామాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పసుపుబోర్డు తీసుకొచ్చామని ఘనంగా చెప్పుకుంటున్న బీజేపీ.. రైతుల దుస్థితిపై నోరు మెదపడం లేదు. పసుపుబోర్డుతో ఎలాంటి మేలు కలగట్లేదని రైతాంగం ఘోషిస్తుంటే అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. 9 నెలల పాటు పడిన కష్టమంతా తక్కువ ధరకే వ్యాపారులకు అప్పగిస్తున్న తరుణంలో రైతులు తెల్లముఖం వేయాల్సిన దుస్థితి నెలకొన్నది. పసుపు సాగుతో పాటు ఈసారి దిగుబడి తగ్గి కష్టాల్లో ఉన్న అన్నదాతలకు అండగా ఉండాల్సిన సమయంలో అటు ఎంపీ అర్వింద్ కానీ, బీజేపీ కానీ, మరోవైపు పసుపుబోర్డు చైర్మన్ కానీ స్పందించడం లేదు.
వాస్తవానికి మార్కెట్‌కు పసుపు రాక తక్కువగా ఉన్నప్పుడు ధర పెరగాలి. కానీ, తక్కువ ధరకే వ్యాపారులు కొనుగోళ్లు చేయడం వెనుక ఉన్న మతలబు ఎవరికీ అంతు చిక్కడం లేదు.
ప్రస్తుతం పసుపు పంట సాగు చేసే రైతన్నలకు రెండో పంటను వెతుక్కోవడం కత్తిమీది సాములా మారింది. పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతోన్న దిగుబడి, చేతికి అందని గిట్టుబాటు ధరల నేపథ్యంలో పసుపు రైతులకు సైతం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ను తెలంగాణ ప్రభుత్వం వర్తింపజేయాలని రైతన్నలంతా కోరుతున్నారు. తద్వార నష్టాల ఊబిలో నుంచి బయట పడేందుకు ఎంతో ఉపయుక్తం అవుతుందని అన్నదాతలు భావిస్తున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే రూ.500 బోనస్‌ను పంటలకు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో పసుపు రైతులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ఈ నిర్ణయాన్ని అమలు చేసి పెద్ద మనసును చాటుకోవాలని కర్షకులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగుకు కష్టాలు ఎదురవుతుండడంతో మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. పెట్టుబడి సాయం కూడా అందకపోవడంతో పసుపు సాగు చేసే రైతన్నలంతా ప్రత్యామ్నాయ పంటల వైపునకు మళ్లుతున్నారు. ఎక్కువ మంది వరి పంట సాగు చేస్తున్నారు.
పసుపు పంట సాగు చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పంట కాలం తొమ్మిది నెలలు. ఎరువులు, రసాయనాలు కలిపి ఎకరాకు రూ.లక్షన్నరకు పైగా పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తున్నారు. తొమ్మిది నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంటకు దుంపకుళ్లు సోకింది. భారీగా దిగుబడి వస్తుందనుకున్న రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎకరాకు సగటున 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం 15-20 క్వింటాళ్లకు మించడం లేదని కర్షకులు వాపోతున్నారు.
ప్రస్తుత సాగు అంచనాల ప్రకారం సుమారు 10 లక్షల క్వింటాళ్ల వచ్చే అవకాశముంది. కానీ, దుంపకుళ్లు కారణంగా 5-7 లక్షల క్వింటాళ్లే వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. పసుపు రాక తగ్గితే డిమాండ్ పెరిగి ధర పెరగాలి. కానీ, మార్కెట్లో రేట్లు అంతగా లేకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ మార్కెట్లో ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకు పలుకుతున్నది. ఈ ధరల వల్ల రైతులకు ఏమాత్రం ప్రయోజనం ఉండడం లేదు. లాభాల సంగతేమో కానీ నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఏటేటా నష్టాలే మిగులుతుండడంతో రైతులు పసు పు సాగు తగ్గిస్తున్నారు. గతంలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో సాగయ్యే పసుపు ప్రస్తుత సీజన్లో 32 వేలకు పరిమితమైంది.
తొమ్మిది నెలలు కష్టపడి పసుపు పండిస్తున్నం. పంట తవ్వి, ఉడక బెట్టి, పాలిష్ చేసి మార్కెట్‌కు తెచ్చినం. ఈడికొస్తే ఏమున్నది. క్వింటాల్‌కు రూ.9 వేలు ధర పలుకుతున్నది. ఈ రేట్ల తో మాకు ఏం సరిపోతది. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాకపోతే మా పరిస్థితి ఏంది?
– గోపిడి లింగారెడ్డి, పసుపు రైతు, చౌట్పల్లి
పసుపుబోర్డు వచ్చిందంటున్నారు. మరీ ధర ఎందు కు పెరుగుతలేదు. పసుపు బోర్డు వస్తే మా పరిస్థితి మారాలే కదా?. ఇంత తక్కువ ధరకు పంటను అమ్ముకోవడం ఇష్టం లేకున్నా తప్పని పరిస్థితిలో వ్యాపారులకు అప్పగిస్తున్నాం. ఇప్పుడున్న రేట్లతో రైతులకు నష్టాలే మిగులుతాయి. రైతుకు గిట్టుబాటు కావాలంటే కనీస ధర రూ.15 వేలైనా ఉండాలి.