భిక్కనూరు ఏప్రిల్ 15 : తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ బిటిఎస్ క్యాంపస్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు సంచల నిర్ణయం తీసుకున్నారు. తాము నిర్వహిస్తున్న అదనపు పరిపాలన బాధ్యతల నుంచి తప్పించాలని దక్షిణ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ కు తమ రాజీనామ పత్రాలను అందించారు. ఈనెల 19వ తేదీ నుండి తాము నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు ప్రిన్సిపాల్ కు సమ్మె నోటీసులు అందజేశామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తాము విశ్వవిద్యాలయ అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూ టీచింగ్ తో పాటు అదనపు పరిపాలన బాధ్యతలను నిర్వహిస్తున్నామన్నారు.
గత 15 నుండి 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా తమ గురించి ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోకపోవడంతో ఆవేదనకు గురవుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించి తమను విస్మరించడం ప్రజా పాలనలో ఇలాంటి వివక్ష దోరణి ఉండటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం చర్చలు జరిపి తన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత, డాక్టర్ రమాదేవి, డా నరసయ్య, కే వైశాలి, డాక్టర్ సరిత, డాక్టర్ నిరంజన్, డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.