బీబీపేట్, ఏప్రిల్ 22: క్రీడలు మానసికోల్లాసం కలిగిస్తాయని, కనీసం రోజూ గంట సమయమైనా కేటాయించాలని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి అన్నారు. బీబీపేట మండలంలోని జనగామ మర్రి సమీపంలో సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో విలేజ్ స్పోర్ప్ డెవలప్మెంట్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించగా, జిల్లాకు చెందిన దాదాపు 300 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఏస్ అధికారి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఉన్న విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు, కానీ పాఠాలను వినడం లేదన్నారు.
అందుకే గతంలో మనం వినాలనే కార్యక్రమాన్ని అన్ని పాఠశాల్లో ప్రారంభించామన్నారు. యువత దేశాన్ని, ప్రపంచాన్ని జయించే విధంగా ఉండాలన్నారు. ఆట, మాట, పాట మూడు కలిస్తేనే నిజమైన మానసిక ఉత్తేజం వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఖేల్ కూద్ నిర్వహించడానికి జనగామ గ్రామమే నాంది అవుతుందన్నారు. సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని, క్రీడాభివృద్దికి తోడ్పాటునివ్వాలని కోరారు.
కొంత మంది డ్రగ్స్, మద్యపానానికి అలవాటు పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి దృష్టిని క్రీడలపైకి మళ్లించేందుకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతానన్నారు. రాష్ట్రస్థాయిలో స్పోర్ట్స్ ఆకాడమీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు తెలంగాణ విఠల్, ప్రజాప్రతినిధులు, ఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.