మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఉవ్విళ్లూరుతున్నది. ప్రజల ఆశీర్వాదం దండిగా ఉన్న అధికార పార్టీ.. ఇప్పటికే వరుస విజయాలతో జోరు మీదున్నది. బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్.. మునుగోడులో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నది. ఉప పోరులో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నది. ఈ క్రమంలో ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను ఉమ్మడి జిల్లా నాయకులకు అప్పగించింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, హన్మంత్‌షిండే, జాజాల సురేందర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి మునుగోడులో ప్రచారం చేయనున్నారు. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసేందుకు వీరంతా తమ అనుచరులతో కలిసి నేటి నుంచే కదన రంగంలోకి దిగనున్నారు.
– నిజామాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందబోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు మెజార్టీ స్థానాల్లో ప్రజల విశ్వాసాన్ని పొందిన గులాబీ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి భారీ స్థాయిలో మద్దతు దక్కుతున్నది. ఇందులో భాగంగా 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. హుజూర్నగర్ ఉప ఎన్నికల స్ఫూర్తితో మునుగోడు నియోజకవర్గంలోనూ గెలుపు బావుట ఎగరేసేందుకు బీ(టీ)ఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం ఆదేశాలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులకు ప్రచార బాధ్యతలు దక్కాయి. ఇందులో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఉన్నారు. వీరంతా సీఎం కేసీఆర్ ఆదేశాలతో మునుగోడు రణరంగంలో నేటి నుంచే అడుగు పెట్టబోతున్నారు.
ఎవరెవరు ఎక్కడెక్కడా?
మునుగోడు నియోజకవర్గంలో చండూర్, చౌటుప్పల్, మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి, నారాయణపూర్ మండలాలున్నాయి. ఇందులో మూడు మండలాల్లోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ) పరిధిలోని గ్రామాలను నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులకు కేటాయించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి చౌటుప్పల్ మండలంలోని డి.నాగారాం, దామెర, చింతలగూడెం గ్రామాలుండగా వీటి పరిధిలో 3091 మంది ఓటర్లున్నారు. చౌటుప్పల్ మండలంలోనే చిన్నకొండూర్, మందొల్లగూడెం గ్రామాల బాధ్యతను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఇక్కడ 3087 మంది ఓటర్లున్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ను చండూర్ మండలంలోని గట్టుప్పల్ గ్రామానికి ఇన్‌చార్జీగా అప్పగించారు. ఇక్కడ 2104 మంది ఓటర్లున్నారు. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి డి.మల్కాపూర్ గ్రామానికి ప్రచార బాధ్యతలు ఇవ్వగా ఇక్కడ 3028 మంది ఓటర్లున్నారు. సీనియర్ శాసనసభ్యుడు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని గ్రామాలను అప్పగించారు. రావిగూడెం, జక్కలవారి గూడెం, జమస్తాన్‌పల్లి పల్లెలున్నాయి. 2409 మంది ఓటర్లున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు పిలిపాలపుల, గంగోరిగూడెం, రాదుపల్లి గ్రామాల్లోని 2926 మంది ఓటర్లకు ఇన్‌చార్జీగా బీ(టీ)ఆర్ఎస్ పార్టీ అప్పగించింది.
గెలుపే లక్ష్యంగా…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులంతా మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. బాధ్యతలు అప్పగించిన ప్రాంతాలకు తమ అనుచరులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులకు రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి సమన్వయం చేయబోతున్నారు. మరోవైపు ప్రచారంలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే బీ(టీ)ఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అమలు చేయబోతున్నారు. కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి మునుగోడు ఉప ఎన్నికలో ఘన విజయమే ధ్యేయంగా వీరంతా పని చేయబోతున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్థానికంగా విపరీతమైన వ్యతిరేకత ఉంది. దీనికి తోడు బీజేపీ నుంచి ఈయన పోటీ చేస్తుండడంతో ప్రతికూలతలే ఏర్పడ్డాయి. మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సైతం వ్యతిరేకత కనిపిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల మనసులు కొల్లగొట్టిన బీ(టీ)ఆర్ఎస్ పార్టీకి మునుగోడు ప్రజలు తప్పక ఆదరించబోతున్నట్లుగా విశ్లేషకులు కుండబద్ధలు కొట్టి మరీ చెబుతున్నారు.
పక్కా ప్రణాళికతో…
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పక్కా ప్రణాళికబద్ధంగా వ్యవహరించేందుకు భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించబోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ప్రజల్లో మాస్ ఫాలోయింగ్ కలిగిన నేతలను ఎంచుకుని ప్రచార బాధ్యతలను అప్పగించింది. ఆయా జిల్లాలకు చెందిన నేతలను ఎక్కడికక్కడే బాధ్యతలు ఇవ్వడం ద్వారా పోలింగ్ తేదీ నాటికి విరామం లేకుండా ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దసరా పర్వదినం సందర్భంగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి స్ఫూర్తితో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున మునుగోడు పోరులో సత్తా చాటనున్నారు. జాతీయ పార్టీగా అవతరించిన బీ(టీ)ఆర్ఎస్ ఏర్పాటు అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధిష్టానం అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. భారీ మెజార్టీతో గులాబీ పార్టీ అభ్యర్థిని గెలిపించడమే ధ్యేయంగా కార్యాచరణ ప్రణాళిక అమలు కానున్నది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇంటింటికెళ్లి వారి మద్దతును కూడగట్టనున్నారు.
కాంగ్రెస్, బీజేపీ గల్లంతే..
మునుగోడు ఉప ఎన్నికలో నూటికి నూరు శాతం భారత్ రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితియే గెలుపొందుతుంది. ఈ ఎన్నికల్లో విజయం అన్నది ఏకపక్షంగా గులాబీ పార్టీకే దక్కబోతోంది. కేసీఆర్ చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల మద్దతు మాకే ఉంది. బీజేపీ, కాంగ్రెస్ నీచ రాజకీయాలపై ప్రజల్లో విరక్తి కలుగుతోంది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జోరులో కాంగ్రెస్, బీజేపీలు గల్లంతు కావడం ఖాయం.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రి
మునుగోడులో గెలిచేది గులాబీ పార్టీయే..
మునుగోడులో బీ(టీ)ఆర్ఎస్ పార్టీ విజయం ఎప్పుడో ఖాయమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని శాశ్వతంగా దూరం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. మిషన్ భగీరథ నీళ్ల ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌కే మునుగోడు ప్రజలు బ్రహ్మరథం పడతారు. బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థే తప్పక గెలుపొందుతారు.
– పోచారం భాస్కర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్
ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దక్కదు..
మునుగోడు ఉప ఎన్నికల పోరులో బీ(టీ)ఆర్ఎస్ పార్టీ విజయం నల్లేరు మీద నడకే అన్నట్లుగా ఉంది. సర్వే ఫలితాలు అన్నీ మావైపే ఉన్నాయి. ఇక్కడున్న ఓటర్లంతా కేసీఆర్ వైపే మొగ్గు చూపుతున్నారు. డిపాజిట్ దక్కించుకోవడం కోసమే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ సీటును మా పార్టీయే కైవసం చేసుకుంటుంది.
– ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే