రెంజల్,(నవీపేట) 2: రెంజల్ కస్తూర్బా పాఠశాల ఆవరణ పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా మారిందని, ఒకవేళ విద్యార్థినులు దురదృష్టవశాత్తు పాములు, విష కీటకాల బారిన పడితే ఎవరు బాధ్యులని విద్యాలయంల ప్రత్యేకాధికారిపై కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని పరిసరాలు, వంట గది, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, తరగతి గదులను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండడాన్ని కలెక్టర్ గమనించారు.
విద్యార్థులు విష కీటకాల బారిన పడితే ఎవరు బాధ్యులని స్పెషల్ ఆఫీసర్ శ్యామల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పరిసరాలను శుభ్రం చేయించాలని, వర్షపు నీరు నిల్వ ఉన్న గుంతల్లో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం సిబ్బంది హాజరుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం మెనూ వివరాలను తెలుసుకొని, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆర్వో ప్లాంట్ నిరూపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్.. తక్షణమే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు.
వ్యక్తులెవరినీ పాఠశాలలోకి అనుమతించవద్దని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బంది పై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. వారం రోజుల తర్వాత మళ్లీ పాఠశాలకు వస్తానని, ఆ లోపు అన్ని లోటు పాట్లను చక్క దిద్దుకోవాలని స్పెషల్ ఆఫీసర్ శ్యామలకు కలెక్టర్ సూచించారు. అనంతరం పదో తరగతి గదిని సందర్శించి విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధించి వారి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. చక్కగా జవాబులు చెప్పిన విద్యార్థులకు తన వద్ద ఉన్న చాక్లెట్లను బహుమతిగా అందించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఎంపీడీవో కమలాకర్ తదితరులు ఉన్నారు.