Nizamabad వినాయక్ నగర్, జూన్ 13 : నిజామాబాద్ జిల్లా లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పలుచోట్ల రోడ్డుపై చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలను శనివారం రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ వెల్లడించారు. సాయంత్రం నుండి భారీగా ఈదురు గాలులు వీచాయి. దీంతో పాటు వర్షం కూడా పడడంతో నిజామాబాద్ మండల పరిధిలోని ఖానాపూర్ రోడ్డులో రాత్రి సమయంలో ఓ భారీ వృక్షం విరిగిపోయి రోడ్డుపై పడిపోయింది.
దీంతో ఆ రోడ్డు వెంబడి రాకపోకలు నిలిచిపోయినట్లు తెలిపారు. అయితే రోడ్డుపై పడిన చెట్టును తొలగించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విషయం తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్లి రోడ్డుపై అడ్డంగా పడిపోయిన చెట్టును పెట్రోలింగ్ సిబ్బంది రోడ్డుపై నుండి తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకల అంతరాయం తొలగిపోయింది.