నిజామాబాద్ స్పోర్ట్స్, అక్టోబర్ 10: నిజామాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కలెక్టరేట్లో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున అన్ని పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పకుండా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయం వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని, శాసన సభకు పోటీచేసే అభ్యర్థి ఖర్చు రూ.40 లక్షలు, పార్లమెంట్ స్థానానికి రూ.95 లక్షలకు మించొద్దని వెల్లడించారు. ఓటరు తుది జాబితాను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, అర్హులందరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకునేలా నాయకులు చొరవ చూపాలని కోరారు. సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు 48 గంటల ముందుగానే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
రాత్రి పది గంటల తర్వాత మైకులు, ప్రచారానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ 1950 లేదా, సీ-విజిల్ యాప్‌లో లైవ్ ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. 80 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, 40శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు ఉన్నందున అవసరమైన వారు 12-డీ ఫారం నింపి నవంబర్ 7 లోపు బీఎల్వోలకు అందజేయాలన్నారు.
పాలిటెక్నిక్, సీఎస్ఐ కళాశాలల పరిశీలన
ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామగ్రి పంపిణీ, ఈవీఎంలను భద్రపర్చేందుకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్ల కోసం నగరంలోని పాలిటెక్నిక్, సీఎస్ఐ కళాశాలలను సీపీ సత్యనారాయణతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అవాంతరాలు తలెత్తకుండా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి
ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కీలక సూచనలు చేశారు. సరిపడా సిబ్బందిని గుర్తించి ర్యాండమ్‌గా నియమాకాలు చేపట్టాలన్నారు. కనీసం 20శాతం మందిని రిజర్వులో ఉంచాలని సూచించారు. ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కల్పించేలా శిక్షణ తరగతులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించాలని, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. మద్యం, నగదు నిల్వలపై గట్టి నిఘా ఉంచాలని సూచించారు.