బాన్సువాడ రూరల్/పిట్లం, జూన్ 5: మంజీర తీరంలో మహా విషాదం నెలకొన్నది. దైవ కార్యానికి వెళ్లిన కుటుంబం మహా శోకంలో మునిగి పోయింది. నదిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. పిట్లం మండలం బొల్లక్‌పల్లి శివారులోని మంజీర తీరంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాదకర ఘటన చోటు చేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పండరి.. బోలక్‌పల్లి శివారులోని మంజీర నది వద్ద శుక్రవారం ఎల్లమ్మ పండుగ చేశాడు. ఈ కార్యక్రమానికి తన ఇద్దరు అన్నలు, అక్కాచెల్లెళ్లు వచ్చారు. పండుగ ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో పండరి కుమార్తె పవనశ్రీ (15), సోదరి అనిత (35), ఆమె కూతురు శివాని (13)తో పాటు భానుప్రసాద్, సుషాంత్ సరదాగా మంజీర నది నీటి వద్దకు వెళ్లారు.
అందులో ప్రమాదవశాత్తు ఒకరు కాలి జారి నీటిలో పడిపోగా, కాపాడేందుకు ఒక్కొక్కరు నీటిలో దూకారు. అలా వారంతా మునిగిపోతూ కేకలు వేయగా, మిగతా కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చి వారిని బయటికి తీశారు. అంబులెన్స్‌లో హుటాహుటిన బాన్సువాడ దవాఖానకు తరలించగా, పరీక్షించిన వైద్యులు అనిత, శివాని, పవనశ్రీ మృతి చెందారని నిర్ధారించారు. అపస్మారక స్థితిలో ఉన్న భానుప్రసాద్, సుషాంత్కు వైద్యం అందించడంతో వారు ప్రాణాలతో బయట పడ్డారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కిష్టాపూర్ గ్రామానికి చెందిన పండరి మొక్కు చెల్లించుకునేందుకు మాంజీర తీరంలో ఎల్లమ్మ పండుగను చేశాడు. అన్నలు, అక్కాచెల్లెళ్లను పిలుచుకుని సంతోషంగా పండుగ చేసుకున్నారు. లింగంపేట మండలం పర్మళ్ల గ్రామానికి చెందిన సోదరి అనిత తన భర్త, కూతురితో సహా వేడుకకు వచ్చారు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ గడిపిన ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకున్నది. ముగ్గురి మృతితో కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ సీఐ తిరుపతయ్య ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరుపై ఆరా తీశారు.