Traffic police | వినాయక్ నగర్, నవంబర్ 6 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్న చిరు వ్యాపారుల పై పోలీసులు వేటు వేశారు. నగరంలోని హైమదీబజార్ లో రోడ్ల పైకి వచ్చి వ్యాపారాలు చేస్తున్న వారిపై గురువారం చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు అక్రమణలను తొలగించారు. హైమదీబజార్ లో మటన్, చికెన్, ఫిష్ మార్కెట్ లతో పాటు కూరగాయలు విక్రయాలు రోడ్డు పై కి వచ్చి జరపడంతో నిత్యం ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ప్రతీరోజు పెద్ద ఎత్తున మార్కెట్ నిర్వహిస్తుండడంతో వాహనాలు అటు వైపు వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడుతుండడంతో దాన్ని నియంత్రించేదుకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐ పీ ప్రసాద్ ఆధ్వర్యంలో దుకాణాల ఎదుట ఉన్న ఆక్రమాలను తొలగించారు. దుకాణదారులు రోడ్డు పైకి వచ్చి వ్యాపారం నిర్వహించరాదని సూచించారు. ఇరువైపుల రోడ్లను ఆక్రమించిన దుకాణాలను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
ఇకమీదట ఎవరైనా మళ్లీ రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించినట్లయితే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై ముజహీద్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.