వినాయక్‌నగర్, జనవరి 8: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా నుంచి తిలక్‌గార్డెన్, బస్టాండ్ ప్రాంతాలకు వెళ్లే రోడ్డును సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాత కలెక్టరేట్ మైదానంలో ఓ సినిమా ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చూడడానికి వేల సంఖ్యలో జనం రావడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.
కలెక్టర్ మైదానం వెలుపలతోపాటు రోడ్డుపై జనం గుంపులు గుంపులుగా నిలబడ్డారు. వారిని అదుపుచేయలేక పోలీసులు నానా పాట్లు పడాల్సి వచ్చింది. ముందస్తు ఏర్పాట్లు, సమాచారం ఇవ్వకపోవడంతో పాదచారులు వెళ్లడానికి కూడా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆకస్మాత్తుగా రోడ్డును మూసివేయడంపై వాహనదారులు మండిపడ్డారు. ఇటీవల సంధ్య థియేటర్ ఘటన జరిగిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని, పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు.