ఖలీల్‌వాడి, అక్టోబర్ 4: కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిజామాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఏకంగా ఆరుగురు మంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమం మొత్తం గందరగోళంగా సాగింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ పీసీసీ హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. నగరమంతా కటౌట్లు కట్టి, తెగ హడావుడి చేశాయి. ఏకంగా కేబినెట్లో మూడొంతుల మందిమంత్రులు ఇందూరుకు తరలివచ్చారు. అయితే, ఊహించిన స్థాయిలో జనాలు రాకపోవడంతో పార్టీ నేతలు కంగుతిన్నారు. వచ్చిన వారు సైతం మహేశ్‌కుమార్ మాట్లాడే సమయానికే వెళ్లిపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా కనబడ్డాయి.
కాంగ్రెస్ సభ వద్ద ఓ నాయకుడు రెచ్చిపోయాడు. కానిస్టేబుల్‌పై జులుం ప్రదర్శించాడు. వేదికపై వెళ్లేందుకు యత్నించగా, అక్కడే ఉన్న స్పెషల్ పార్టీ పోలీసు అరవింద్ అడ్డుకున్నాడు. వేదిక పైకి అనుమతి లేదని చెప్పగా ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ నాయకుడు పోలీసు కాలర్ పట్టుకుని లాగాడు. దీంతో షర్టు గుండీలు తెగిపోయాయి. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోగా, సదరు నేత చెంప చెళ్లుమనిపించడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు సదరు కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదైంది.