కామారెడ్డి, జూలై 6 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో పేలుడు పదార్థాలు లభించిన ఘటన సంచలన సృష్టించగా.. పోలీసులు ఈ కేసులో దూకుడు పెంచారు. పట్టణంలో రెండు రోజుల క్రితం పట్టుకున్న జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాల సరఫరా కేసులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. జిలెటిన్ స్టిక్స్ సరఫరాలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో ఉన్న ఓపెన్ ప్లాట్‌లో బండరాళ్లు పేల్చేందుకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి చెందిన శ్రీవారి ఏకో టౌన్షిప్ నుంచి జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు తీసుకువచ్చారు.
ఈ విషయం పోలీసులకు తెలియడంతో శ్రీవారి వెంచర్లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా పేలుడు పదార్థాలను తన వెంచర్లో నిల్వ చేయడంతోపాటు ఇతరులకు సరఫరా చేసిన కేసులో చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తరలించినట్లు సమాచారం. కాగా ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు సురేందర్ రెడ్డి పరారీలో ఉన్నాడని, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.
రెండేండ్ల క్రితం ఈ వెంచర్‌ను అభివృద్ధి చేసిన చంద్రశేఖర్ రెడ్డి ఇతరులకు విక్రయించాడు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పేలుళ్లూ జరగడంలేదు. తాజాగా అధికార కాంగ్రెస్ నేతను అరెస్టు చేయడంలో మరో బడా నేత ప్రమేయం ఉన్నదని, కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తడమే అరెస్టు వరకు దారితీసిందని సొంత పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. జిల్లాలో ఏ చిన్న దొంగతనం, హత్య జరిగినా ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు తెలియజేసే పోలీసులు ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎలాంటి విషయాలు అధికారికంగా వెల్లడించలేదు. గోప్యంగా ఉంచడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై చంద్రశేఖర్ రెడ్డి సతీమణి, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందుప్రియ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..తన భర్త అరెస్టులో రాజకీయ కుట్ర ఉన్నదని ఆరోపించారు.