స్వరాష్ట్ర సాధనలో వెన్నంటి నడిచిన ఇందూరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం నేడు తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఏర్పాట్లు చేసిన గులాబీ శ్రేణులు
తెలంగాణపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ..ఒక ఉద్యమ కెరటం ఎగిసింది. సబ్బండ వర్గాలను సమ్మిళితం చేసి స్వరాష్ట్ర కాంక్షను రగిలించింది. ఆంధ్ర పాలకుల కుట్రలకు ఎదురొడ్డి, కేంద్రం మెడలు వంచి, తెలంగాణను సాధించిన ఆ ఉద్యమ సూరీడే బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. ప్రాణాలకు తెగించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్‌కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో ప్రత్యేక
అనుబంధం ఉన్నది.
తెలంగాణ సాధన కోసం ఒంటరిగా బయల్దేరిన ఆయనను ఇందూరు గడ్డ అక్కున
చేర్చుకున్నది. బీఆర్ఎస్ స్థాపనతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన కేసీఆర్‌కు మొదట జేజేలు పలికింది వేల్పూర్ మండలంలోని మోతె గ్రామమే. 2001 మే 5న ఇక్కడి మట్టితో ముడుపు కట్టిన కేసీఆర్ తెలంగాణ తెస్తానని శపథం చేశారు. 13 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నోసార్లు ఉమ్మడి జిల్లాకు వచ్చిన ఆయన ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు.
బోధన్‌లో నిరాహార దీక్ష చేసి, ఆర్మూర్‌లో ఎర్రజొన్న రైతుల తరఫున పోరాడి, కామారెడ్డిలో ‘ధూం ధాం’ నిర్వహించి స్వరాష్ట్ర కాంక్షను సజీవంగా నిలిపారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు కేసీఆర్ వెన్నంటి నడిచారు. అలా ఆనాటి నుంచి మొదలైన ఉద్యమ అనుబంధం తెలంగాణ సిద్ధించాక కూడా కొనసాగుతున్నది. ఇందూరు గడ్డపై కేసీఆర్‌కు ఎంతో ఆప్యాయత ఉంది. అందుకే మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆయన ఉమ్మడి జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. నేడు కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆయన ఉద్యమ ప్రయాణం, అభివృద్ధి ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
-బోధన్/వేల్పూర్, ఫిబ్రవరి 16
నీళ్లు, నిధులు నియామకాలతోపాటు స్వపరిపాలన సాధన కోసం నిర్వహించిన తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్ఫూర్తిగా నిలిచింది. ఉద్యమ దళపతి, గులాబీపార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడి నుంచే సమరం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పురుడు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి వెన్నంటే నిలిచింది. 2001 నుంచి ఇప్పటి వరకు గులాబీ బాస్ అన్నా.. పార్టీ అన్నా.. ఇక్కడి ప్రజలకు ఎంతో అభిమానం.
బీఆర్ఎస్ ఆవిర్భావ తొలినాళ్లలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయాలను అందించారు ఇక్కడి ప్రజలు. జాతీ య పార్టీలను సైతం కాదని బీఆర్ఎస్ను అక్కున చేర్చుకున్నారు. ఆంధ్ర పెత్తందారుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన బీఆర్ఎస్ పోరాటానికి ఊరూ రా మద్దతు పలికారు. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ కేసీఆర్ నాడు చేసిన పర్యటనలు చరిత్రలో నిలిచిపోయాయి. మోతెలో మట్టి ముడుపు, బోధన్‌లో నిర్వహించిన నిరాహార దీక్షలు, ఆర్మూర్‌లో చేపట్టిన బీఆర్ఎస్ ఆవిర్భావ మహాసభలు, కామారెడ్డి జిల్లాలో పార్టీ కోసం నిర్వహించిన కూలీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొని ప్రజల్లో స్ఫూర్తిని రగిలించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిన గడ్డ మోతె. స్వరాష్ర్టాన్ని సాకారం చేసిన ఉద్యమ నేత కేసీఆర్‌కు మోతె గ్రామానికి ఉద్యమ ఆత్మీయ అనుబంధమున్నది. తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా పని చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్కు మాత్రమే అండగా ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తొలి గ్రామం మోతె .అయితే మోతె చాటిన ఈ స్ఫూర్తిని ఉద్యమ వ్యాప్తం చేసిన నాయకుడు కేసీఆర్. మోతె ఉద్యమ స్ఫూర్తిని నలుదిక్కులా చాటేందుకు అప్పట్లో కేసీఆర్ మోతె గడ్డ మట్టిని ముడుపు కట్టి తన వెంట తీసుకెళ్లారు.
సకల జనులతో సుదీర్ఘ ఉద్య మం సాగించి..చావు నోట్లో తలపెట్టి స్వరాష్ర్టాన్ని సాధించుకున్నాక కేసీఆర్ మట్టి ముడుపును మళ్లీ మోతెకు తీసుకొచ్చి ఇక్కడే విప్పారు. ఇలా కేసీఆర్‌కు, మోతెకు మధ్య ఉద్యమ మట్టి ముడుపు సంబంధమున్నది. రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా సాగుతున్న బీఆర్ఎస్కు, కేసీఆర్‌కే తాము మద్దతునిస్తామని అప్పటి స్థానిక సంస్థల సందర్భంలో 2001 మే 5న మోతె గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మోతె ప్రదర్శించిన ఈ ఉద్యమ స్పూర్తి అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తెలంగాణ గ్రా మల్లో ఉద్యమ ఆకాంక్షలకు నిదర్శనంగా నిలిచించి. తెలంగాణ కోసం ఏకగ్రీవంగా నడుం కట్టిన తొలి గ్రామంగా రికార్డులో నిలిచింది. దీంతో కేసీఆర్, దివంగత నేత వేముల సురేందర్‌రెడ్డి తదితర నాయకులతో కలిసి మోతెకు వెళ్లి గ్రామస్తుల ఉద్యమ పటిమను అభినందించారు. రాష్ట్రం ఆవిర్భవించాక 2014 మార్చి 28న వేముల సురేందర్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి మోతెకు వచ్చి ముడుపు విప్పారు.
1986లోనే కేసీఆర్ స్వయంగా కారు నడుపుకొంటూ అంకాపూర్ వచ్చి ఇక్కడి దేశీ చికెన్ తిన్నానని పలు సందర్భాల్లో చెబుతుంటారు. తొలిసారిగా సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అంకాపూర్‌ను రహస్యంగా సందర్శించి, రైతులకు పత్రికా విలేకరిగా పరిచయం చేసుకొని పొలాలను సందర్శించినట్లు కేసీఆర్ చెప్పడం విశేషం. ఇప్పటికీ మహిళా సాధికారత విషయంలో… వ్యవసాయం విషయంలో ఎక్కడ ఎలాంటి సభ నిర్వహించినా ఆర్మూర్, అంకాపూర్‌ను గుర్తు చేస్తుంటారు కేసీఆర్.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రాంతంగా.. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో తిరుగులేని ఆదరణ, మద్దతు లభించింది. ఉద్యమంలో వివిధ రకాల కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో కలిసి కేసీఆర్ ఉద్యమం సాగించారు. పార్టీని నడిపేందుకు అయ్యే ఖర్చులు, బహిరంగ సభల కోసం పార్టీ శ్రేణులు కూలీ పని చేయాలని నిర్ణయించి కూలీ ద్వారా నిధి సేకరించారు.
కామారెడ్డి పట్టణంలోని దేశాయి బీడీ ఫ్యాక్టరీ గోడౌన్లో తెలంగాణ కూలీ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీడీ బెండళ్లను స్వయంగా మోశారు. కామారెడ్డి గాంధీ గంజ్‌లో బెల్లం ముద్దలను మోశారు. 2001లో బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కామారెడ్డి పట్టణంలో ఇరవైసార్లు పర్యటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కామారెడ్డి ప్రాంతం అండగా నిలుస్తూ వస్తున్నది.
సీఎం కేసీఆర్‌కు కామారెడ్డి ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉం ది. బీబీపేట మండలం కోనాపూర్ గ్రామంలో కేసీఆర్ తల్లి వెంకటమ్మ జన్మించారు. మానేరు ముంపు గ్రామం కాకపోతే కోనాపూర్‌లోనే కేసీఆర్ నివాసం ఉండి పెరిగే వారు. కేసీఆర్ తండ్రి రాఘవరావుది కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట. రాఘవరావు ఇల్లరికపు అల్లుడిగా పోసానిపల్లి గ్రామానికి వచ్చి వెంకటమ్మను వివాహం చేసుకున్నారు. ఎగువ మానేరు నిర్మాణ సమయంలో భూములు ముంపునకు గురికావడంతో కేసీఆర్ తల్లిదండ్రులు సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లారు. కేసీఆర్ చింతమడకలోనే జన్మించారు. కేసీఆర్ తల్లిదండ్రులకు సంబంధించిన కోనాపూర్‌లోని ఇల్లు శిథిలావస్థకు చేరగా, దాన్ని గతంలోనే అమ్మివేశారు. ఉద్యమ సమయంలో కామారెడ్డిలోని కేసీఆర్ మేనమామ అడ్వకేట్ రామారావు, మేనల్లుడు కాంతారావు ఇంట్లోనే ఎక్కువగా ఉండేవారు.
తెలంగాణ ఉద్యమ కార్యాచరణకు, గులాబీ పార్టీ రాజకీయ శక్తిగా మారేందుకు దశాదిశను చూపింది ఆర్మూర్. ప్రత్యేక రాష్ట్ర సాధనలో తనదైన ముద్ర వేసుకున్నది. అలాగే పార్టీ అధినేత కేసీఆర్‌కు ఈ ప్రాంతంతో విడదీయని అనుబంధం ఉన్నది. 2013 ఏప్రిల్ 27న ఆర్మూర్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతినిధుల మహాసభ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడోసారి బీఆర్ఎస్ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఇక నుంచి ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోరాటం చేస్తామని ఎన్నికల సైరన్ మోగించడం ప్రత్యేకతను సంతరించుకున్నది. 2014 మే 13న ఆర్మూర్‌కు వచ్చిన కేసీఆర్ మొదటి ఎమ్మెల్యే టికెట్‌కు ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేరును ప్రకటించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనే ధ్యేయంగా బోధన్ పట్టణంలో సుదీర్ఘకాలంపాటు కొనసాగిన నిరాహారదీక్షలకు కేసీఆర్ స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. బోధన్‌లో ఏకంగా 1519 రోజులపాటు తెలంగాణవాదులు నిరాహారదీక్షలు చేశారు. 2009 డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ నిరాహారదీక్షలు 1519 రోజులపాటు.. అనగా 4 సంవత్సరాల 17 రోజులపాటు కొనసాగి 2014 ఫిబ్రవరి 23న ముగిశాయి. నిరాహారదీక్షలకు ఏడాది పూర్తయిన సందర్భంగా 2010 డిసెంబర్ 27న కేసీఆర్ బోధన్‌కు వచ్చారు.
ఆ తర్వాత రెండో సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూడా (2011 డిసెంబర్ 28న) కేసీఆర్ వచ్చారు. ఆ రోజున శిబిరంలో 731రోజులకు గుర్తుగా 731 మంది మహిళలు దీక్షలో కూర్చున్నా రు. ఈ రెండు సందర్భాల్లోనూ బోధన్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. ‘బోధన్‌లో తెలంగాణ కోసం నిరవధికంగా నిరాహారదీక్షలు చేస్తున్న తెలంగాణ బిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..’, ‘బోధన్ తెలంగాణ బిడ్డలకు నా సెల్యూట్’ అంటూ నాటి సభల్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు.