నిజామాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహా నాయకుడు కేసీఆర్. ఉద్యమ నాయకుడిగా ఆయన తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. నినాదంతో ఆమరణ దీక్షకు దిగిన రోజు 2009 నవంబర్ 29. నేటితో కేసీఆర్ ఆమరణ దీక్షకు 15 ఏండ్లు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజ్వలింపజేసి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన ఆ రోజును బీఆర్ఎస్ దీక్షా దివస్‌గా పాటిస్తున్నది.
2009 నవంబర్ 29న కరీంగనర్‌లోని కేసీఆర్ భవన్ నుంచి దీక్షాస్థలి సిద్దిపేటకు కేసీఆర్ బయల్దేరగా.. కరీంనగర్ మానేరు బ్రిడ్జి వద్ద పోలీసులు కేసీఆర్‌ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తర్వాత నిమ్స్ దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడే కేసీఆర్ తన ఆమరణ దీక్షను 11 రోజులపాటు కొనసాగించారు. ఆరోగ్యం క్షీణించినా, ప్రాణం పోయినా సరే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తీరుతానని స్పష్టంచేశారు. కేంద్రం తెలంగాణను ఇవ్వకతప్పని అనివార్యతను సృష్టించారు.
డిసెంబర్ 9న తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే ఆయన దీక్షను విరమించారు. తర్వాత అనేక అడ్డంకులను అధిగమించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. కేసీఆర్ దీక్షకు దిగిన ఆ రోజు చరిత్రలో అజరామరంగా నిలిచిపోగా.. బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్‌ను నిర్వహిస్తున్నది. భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో నేడు దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించనున్నారు.
ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితో ఈసారి అన్ని జిల్లాకేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు 33 జిల్లాలకు సీనియర్ నాయకులను ఇన్‌చార్జీలుగా నియమించారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఈ నెల 26న సన్నాహక సమావేశాలను నిర్వహించారు. ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేలా దీక్షా దివస్‌ను చేపడుతామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
నిజామాబాద్ జిల్లాకు దీక్షా దివస్ ఇన్‌చార్జీగా మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కామారెడ్డి జిల్లాకు ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను నియమించింది. వీరి నేతృత్వంలో ఇప్పటికే సన్నాహకసమావేశాలు జరిగాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతోపాటు ప్రతి నియోజకవర్గం నుంచి వందలాది మంది దీక్షా దివస్ కార్యక్రమాలకు తరలిరానున్నారు. కేసీఆర్ దీక్షా ఫలితంగా డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకున్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని వక్తలు ఎండగట్టనున్నారు.