నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 13 ; స్వరాష్ట్రంలో సర్కారు వైద్యంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది. ఏ రోగమొచ్చినా అధునాతన చికిత్స దొరుకుతుందనే భరోసా నింపింది. సీఎం కేసీఆర్ పగ్గాలు చేపట్టాక వైద్యరంగాన్ని బలోపేతం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మార్చేశారు. సకల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ స్థాయిలో అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చారు. పేదల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు. డయాలసిస్, డయాగ్నోస్టిక్ సెంటర్లు, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి లాంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ఫలితంగా ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం కలిగింది. సమైక్య పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకున్న జనం.. ఇప్పుడదే సర్కారు దవాఖానకు జైకొడుతున్నారు.
ఆర్మూర్, జూన్ 13 : ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించడం.. అన్ని విభాగాల్లో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండడంతో రోగులు బారులు తీరుతున్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవతో ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానను 30 పడకల నుంచి వంద పడకల దవాఖానకు మార్పుచేశారు. సుమారు రూ.40కోట్లతో నూతన భవనాలు, పరికరాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రవాసలు ఇక్కడే నమోదు అవుతుండడం విశేషం. నిత్యం 200వరకు ఓపీ సేవలు అందిస్తుండగా, అందులో 60నుంచి 80మంది గర్భిణులు ఉండడం గమనార్హం. రోజుకు సగటున 10 ప్రసవాలు చేస్తున్నారు.
తొమ్మిదేండ్లలో 25వేల ప్రసవాలు
ప్రభుత్వ దవాఖానలో ముగ్గురు స్త్రీ వైద్య నిపుణులు, పిల్లల వైద్య నిపుణులు ఒకరు, సూపరింటెండెంట్ నాగరాజు పర్యవేక్షణలో ప్రసూతి విభాగం సేవలందిస్తున్నది. ప్రతినెలా 400 నుంచి 500 ప్రవాసలు లక్ష్యంగా నిర్దేశించుకోగా దానిని అధిగమించేందుకు కృషి చేస్తున్నారు. తొమ్మిదేండ్లలో 25వేల ప్రసవాలు చేశారు. సాధారణ ప్రసవాలే అధికంగా ఉండడంతో గర్భిణులు ఈ దవాఖానకు వస్తుండడం విశేషం. డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఐదు నెలల వ్యవధిలో 600 మంది బాధితులకు సేవలందించారు.
బాన్సువాడ ఎంసీహెచ్.. సేవల్లో భేష్..
సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందుతుండడంతో ప్రజలు హర్షంవ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కృషితో ప్రభుత్వ దవాఖానలు వైద్య సేవల్లో పోటీ పడుతూ జాతీయ స్థాయి అవార్డులను అందుకుంటున్నాయి. ఆ కోవలోకి చెందినదే కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ఎంసీహెచ్. కాయకల్ప, లక్ష్య అవార్డులను అందుకున్న ఈ దవాఖాన ప్రస్తుతం ముస్కాన్ అవార్డుకు పోటీ పడుతున్నది.
నర్సింగ్కాలేజీ..
బాన్సువాడ పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎం కేసీఆర్ సహకారంతో 30 పడకల ఏరియా దవాఖానను వంద పడకలకు అప్‌గ్రేడ్ చేయించారు. తల్లీబిడ్డల సంరక్షణలో భాగంగా మరో వంద పడకల మాతాశిశు దవాఖాన ఏర్పాటు చేయించారు. బాలికలకు ఉపాధి కల్పించడంతోపాటు పేద ప్రజలకు సేవలందించే లక్ష్యంతో బీఎస్సీ నర్సింగ్ కళాశాలను మంజూరు చేయించారు. నాలుగేండ్ల బీఎస్సీ నర్సింగ్ కళాశాల ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కొనసాగుతున్నది. శాశ్వత భవన నిర్మాణం కోసం స్పీకర్ పోచారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.40కోట్లు మంజూరు చేయించారు.
విస్తృతంగా బ్లడ్‌బ్యాంక్ సేవలు
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో సుమారు కోటి రూపాయల వ్యయంతో బ్లడ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. 2021లో ప్రారంభమైన బ్లడ్‌బ్యాంక్ సేవలను రోజురోజుకూ విస్తృతం చేస్తున్నారు.
అవార్డులు కోకొల్లలు.
బాన్సువాడ ఎంసీహెచ్‌లో అందించే వైద్య సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు వచ్చాయి. మాతా శిశు దవాఖానకు ఐదుసార్లు కాయకల్ప అవార్డు వచ్చింది. 2019లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డు అవార్డు వచ్చింది. 2021- 22లో ఏకో ఫ్రెండ్లీ అవార్డు సాధించింది. 2023లో దేశ ఖ్యాతిని నిలిపేలా బ్రెస్ట్ ఫీడింగ్ దవాఖాన ఇన్షియేటివ్ను దక్కించుకోవడం విశేషం.
బాన్సువాడ ఎంసీహెచ్‌లో టిఫా స్కానింగ్
బాన్సువాడ మాతాశిశు దవాఖానలో ప్రభుత్వం టిఫా స్కానింగ్ మిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రోజుకు సుమారు 300-500 మంది వరకు ఇక్కడ వైద్య సేవలు పొందుతారు. 15 నుంచి 25 వరకు ప్రతి రోజూ డెలివరీలు జరుగుతున్నాయి.
మెడికల్ హబ్‌గా కామారెడ్డి
గతంలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందని ద్రాక్ష అనే నానుడి ఉండేది. కానీ ప్రస్తుతం నాణ్యమైన వైద్య సేవలకు ప్రభుత్వ దవాఖానలు పెట్టింది పేరుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా దవాఖానను అప్‌గ్రేడ్ చేయడంతో పేద ప్రజలకు సేవలు మరింత చేరువయ్యాయి. అంతే కాకుండా దవాఖానలో మాతా శిశు సంరక్షణ కేంద్రం, డయాలసిస్, పాలియేటివ్ కేర్, లేబర్ రూం, ట్రామా కేర్, ఇంటెన్స్ కేర్ యూనిట్, ప్యాలెట్ థెరపీ, ఆక్సిజన్ ప్లాంట్, టిఫా స్కానింగ్ యంత్రాలు, 29 వెంటిలేటర్లు,14 హెచ్ఎఫ్ఎన్సీ యంత్రాలు,10 రేడియంట్ సౌకర్యాలు కల్పించారు. ముఖ్యంగా జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన మెడికల్ కాలేజీ ఏర్పాటు సాకారమైంది. 280 పడకల దవాఖాన, ప్రత్యేక చికిత్సలు చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వంద సీట్లతో భర్తీ కానున్న మెడికల్ విద్యార్థులతో ఈ ప్రాంతంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. కామారెడ్డి ఏరియా దవాఖానలో నెలకు 400 ప్రసవాలు జరుగుతున్నాయి.
కల సాకారం..
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చా యి. గతంలో మెరుగైన వైద్యం కోసం ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో వైద్యరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలను అప్‌గ్రేడ్ చేస్తూ సకల సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే భీమ్‌గల్ మండల కేంద్రంలోని పది పడకల దవాఖానను వంద పడకలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశాలు జారీ చేసింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో దవాఖాన నిర్మాణానికి రూ. 45 కోట్ల నిధులను మంజూరు చేయించారు. గత ఏడాది జూన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పనులను ప్రారంభించారు. ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దవాఖాన నిర్మాణం పూర్తయితే మండలంతోపాటు చుట్టు పక్కల మండలాల వారికి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు జిల్లా దవాఖానలకు తిరగాల్సిన పనిలేకుండా పోతుంది.
జీజీహెచ్‌లో మల్టీస్పెషాలిటీ వైద్య సేవలు
ఖలీల్‌వాడి, జూన్ 13 : కార్పొరేట్‌స్థాయి సేవలు, అరుదైన శస్త్ర చికిత్సలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుటున్న నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో రోగులకు మరింత నాణ్యమైన వైద్యం అందుతున్నది. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌కు పేషెంట్ల తాకిడి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వివిధ డిపార్ట్మెంట్లలో 29 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించారు.
1500కు పైగా ఓపీ..
నిజామాబాద్ జీజీహెచ్‌లో మొత్తం 25 విభాగాలున్నాయి. ఇందులో 200 మంది వైద్యులు పనిచేస్తున్నారు. దీంతో రోజువారీ ఓపీ 400 నుంచి 1500కు పెరిగింది. తాజాగా మరో 29 మంది మల్టీ స్పెషాలిటీ వైద్యులు రావడంతో రోగులకు మరింత మెరుగైన సేవలు అందుతున్నాయి.
ప్రజాప్రతినిధుల కృషితో మెరుగైన వసతులు..
ఉత్త సేవలకు గాను జీజీహెచ్‌కు అనేక అవార్డులు సైతం వరించాయి. దీనికితోడు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల, బాజిరెడ్డి కృషితో అత్యాధునిక వైద్య పరికరాలు, రోగులకు కార్పొరేట్ వసతులు కల్పించారు. సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రే, ఇతర స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. పాథలాజికల్ ల్యాబ్ ఏర్పాటు చేసి అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల క్యాథ్‌ల్యాబ్ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 253కి పైగా మోకీలు చిప్పల మార్పిడి చేసిన ఘనత దక్కించుకున్నది. దీంతోపాటు రోజుకు రూ.5వేల విలువైన డయాలసిస్ సేవలను ప్రతినెలా దాదాపు 90 మందికి పైగా రోగులకు అందిస్తున్నారు.
కిడ్నీ బాధితులకు వరం..
కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రాలు వరంగా మారాయి. గతంలో పట్టణ ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు దఖానల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే ఆర్థిక, దూర భారంతో బాధితులు నానాలు తిప్పలు పడ్డారు. ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రాల్లోనే ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోధన్ దవాఖానలో 2018లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి ఈ సెంటర్లో బాధితులకు 24/7 సేవలు అందిస్తున్నారు. ప్రైవేటు దవాఖానల్లో డయాలసిస్ చేయించాలంటే కనీసం రూ.2,500 నుంచి రూ. 6వేలకు పైగానే వసూలు చేస్తారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.