ఖలీల్‌వాడి/నిజామాబాద్ స్పోర్ట్స్, జనవరి 26: ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలందరికీ అందాలని బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో రోజుకు 75 వేల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నదని పేర్కొన్నారు.
వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌తోపాటు రైతు భరోసా పథకం ద్వారా 1,76,113 మంది చిన్నకారు రైతుల ఖాతాల్లో రూ. 89.86 కోట్ల జమచేసినట్లు చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు 100 శాతం ఉత్తీర్ణత కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తునట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, మేయర్ దండు నీతూకిరణ్, సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం.మకరంద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరింపజేశాయి.