కామారెడ్డి, ఏప్రిల్ 21 : నెలవంక దర్శనంతో రంజాన్ పండుగ వచ్చేసింది. షవ్వాల్ మాసం నెలవంక కనిపించడంతో పుణ్యఫలాల పవిత్ర రంజాన్ మాసం 30 రోజుల ఉపవాస దీక్షలు ముగిశాయి. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లింలు శుక్రవారం సాయంత్రం దీక్షలు విరమించి శనివారం రంజాన్ పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోవడానికి ఉమ్మడి జిల్లాలోని ఈద్గాలు, దర్గాలను ముస్తాబు చేశారు. ముస్లింలు రంజాన్ వేడుకలు జరుపుకోవడానికి మసీదుల వద్ద మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈద్-ఉల్-ఫితర్ చరిత్ర..
నెల రోజులపాటు రంజాన్ దీక్షలు పాటించిన ముస్లింలు పవిత్ర మాసం అనంతరం షవ్వాల్ నెల మొదటి రోజు జరుపుకునే పండుగే ఈద్-ఉల్-ఫితర్ అంటారు. నమాజ్ చేసిన అనంతరం ఇష్రాఖ్ సమయం ప్రారంభమైన తర్వాత ఈద్-ఉల్-ఫితర్ రెండు రకాలుగా నమాజ్ చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఈద్-ముబారక్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకొంటారు. ధనిక, పేద అనే తేడా లేకుండా సమాజంలోని అందరూ ఒకే విధమైన దినచర్యను పాటిస్తారు. అంతా ఒకే భావన, ప్రేమాభిమానాలను చాటడానికి ఈ పండుగ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.
ఫిత్రా దానం..
షవ్వాల్ మాసపు మొదటి రోజు ఈద్-ఉల్-ఫితర్ పండుగ నాడు ప్రార్థనలకు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. అందుకే ఈ పండుగకు ఈద్-ఉల్-ఫితర్ అని పేరు వచ్చింది. షరియత్ పరిభాషలో ఫిత్రా అంటే ఉపవాసాల పాటింపులో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. ఆ లోపాలు పోయేందుకు చేసేదే ఫిత్రాదానం. సమాజంలోని నిరుపేదలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఈ దానం చేస్తారు. పావు తక్కువ రెండు కిలోల గోధుమల తూకానికి సరిపడా పైకాన్ని నిరుపేదలకు దానం చేయాలి. నమాజ్ కోసం ఈద్గాకు వెళ్లేటప్పుడు ‘అల్లాహ్అక్బర్-అల్లాహ్ అక్బరలాయి లాహ ఇల్లాలాహు వల్లాహూ అక్బర్, అల్లాహు అక్బర్ విలిల్లాహిల్ హామ్ద్’అనే తక్బీర్‌ను పఠించాలి. అంతేకాకుండా ఈద్గాకు వెళ్లేటప్పుడు కాలి నడకన ఒక దారిన, వచ్చేటప్పుడు మరో దారిలో రాడం ఉత్తమం.
ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ప్రత్యేకం..
ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ కోసం ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ఫజర్ నమాజ్ అనంతరం ఇష్రాఖ్ నమాజ్ సమయం ప్రారంభమైన తర్వాత నమాజ్ చేస్తారు. నమాజ్ కోసం ఆజాన్, ఆఖామత్ చెప్పనవసరం లేదు. ఈ నమాజ్‌కు ముందు ఎలాంటి సున్నత్ నమాజ్‌లు చేయరాదు. ఇమామ్‌లు ఈద్-ఉల్-ఫితర్ గురించి ఉపదేశించి నియమాలు వివరిస్తారు. నమాజ్ అనంతరం ఖుద్బాను పఠిస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగంనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొంటారు.
ముస్లింలకు ప్రముఖుల శుభాకాంక్షలు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ముస్లింలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్‌తో పాటు ఇన్చార్జి సీపీ ప్రవీణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిములు చేపట్టిన ఉపవాస దీక్షల పుణ్య ఫలంతో రాష్ట్రం, జిల్లా మరింత ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని కోరారు. ఈద్-ఉల్-ఫితర్ నమాజ్‌ను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని వారు సూచించారు.