CP Sai Chaitanya | వినాయక్ నగర్, ఆగస్టు 2 : నిజామాబాద్ నగరంలో ఊర పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలలో నిర్వహించిన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేకించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. ఊర పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. ప్రధానంగా ప్రార్థన మందిరాల వద్ద పోలీసులు ప్రత్యేక వికెట్లను ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన వీధుల్లో మొబైల్ పెట్రోలింగ్ తోపాటు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందం దేవత మూర్తుల విగ్రహాలు తరలి వెళ్లే ప్రధాన రోడ్ల వెంబడి తనిఖీలు నిర్వహించారు.పండుగ జరుగుతున్న ప్రధాన ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలు, రద్దీ కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలను సందర్శించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతీ సున్నిత ప్రాంతంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సీపీ సిబ్బందిని ఆదేశించారు. ఊర పండుగలు మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని పోలీస్ బాస్ సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, అంబులెన్స్‌లు, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు. దేవత మూర్తుల ఊరేగింపు సాగే ప్రాంతాలలో సీసీ కెమెరాలు/డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా పెట్టారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. పికెట్లు, మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేసి భక్తులకు భద్రత కల్పించాలని ఈ సందర్భంగా సిపి ఆదేశించారు. ఉదయం ప్రారంభమైన గ్రామదేవతల ఊరేగింపు మధ్యాహ్నం వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసింది. ఈ గ్రామదేవతల ఊరేగింపు బందోబస్తులో నిజామాబాద్ సీసీఆర్బీ, సీసీఎస్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, గురు నాయుడు, శ్రీశైలం, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రఘుపతితో పాటు ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.