Tiger attacks | సిరికొండ, జనవరి 7 : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి గ్రామ పరిధిలోని కొత్త తిరుపతి ఆడవుల్లో మంగళవారం రాత్రి జిట్ట లేగదూడపై దాడి చేసి హతమార్చినట్లు ఇంచార్జి ఎఫ్ఆర్ఓ బీ రవీందర్ బుధవారం తెలిపారు. ఎఫ్ఆర్వో వివరాల ప్రకారం.. సిరిసిల్ల రిజర్వు ఫారెస్ట్ తిరుపతి గుట్ట బీట్ కంపార్ట్ మెంట్ నంబర్ 500 పరిధిలో ఇవాళ సాయంత్రం లేగ దూడపై జిట్ట పులి దాడి చేసింది. ఈ విషయాన్ని గోప్య నాయక్ తాండ నివాసి లేగ దూడ యజమాని మాలావత్ రఘుపతి ఇచ్చిన సమాచారం ఇచ్చారు.
ఈ మేరకు లేగ దూడను జిట్ట పులి హతమార్చిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించాం. వెటర్నరీ డాక్టర్ అభిషేక్ ను తీసుకువెళ్లి జిట్ట పులి దాడిలో మృతిచెందిన లేగదూడకు పంచనామా చెయించాం. పంచనామా అనంతరం మృతి చెందిన లేగ దూడ రూ.30వేల విలువ గలదని వెటర్నరీ డాక్టర్ నిర్ధారించిన ధ్రువపత్రాన్ని అందించినట్లు ఎఫ్ఆర్వో వివరించారు.
ఈ విషయాన్ని డీఎఫ్ఓకు వివరించి లేగ దూడను కోల్పోయిన యజమాని మాలావత్ రఘుపతికి నష్ట పరిహారం ఇప్పిస్తామని ఎఫ్ఆర్వో తెలిపారు. అడవి జంతువులు అటవీ ప్రాంతంలో ఆవు దూడలు, గేదెలపై దాడి చేసినట్లయితే అటవీ అధికారులకు తెలియజేయాలని డిపార్ట్మెంట్ ద్వారా నష్టపరిహారం చెల్లిస్తామని ఎఫ్ఆర్ఓ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అడవి జంతువులకు ప్రాణాన్ని తలపెడితే చట్ట ప్రకారం ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.