రామారెడ్డి, జూలై 17: రామారెడ్డి మండలంలో పెద్దపులి సంచారం భయాందోళన కలిగిస్తున్నది. రెడ్డిపేట్ స్కూల్ తండాలో ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపేయగా, తాజాగా మరో ఆవు వన్యమృగం దాడికి బలైపోయింది. గోకుల్ తండా గ్రామంలో గురువారం సాయంత్రం బాదవత్ పుల్యకు చెందిన ఆవుల మందపై పులి దాడి చేసి, ఓ ఆవును చంపేసింది.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఉమ్మడి జిల్లాకు వచ్చిన పెద్దపులి కోసం ఫారెస్టు సిబ్బంది అడవులను జల్లెడ పడుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. కొద్ది రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ దాని జాడ దొరకలేదు. తాజాగా గోకుల్ తండాలో ఆవుల మందిపై దాడి చేసింది పెద్ద పులే అని ప్రత్యక్షంగా చూసిన పుల్య తెలిపారు. వన్య మృగాల నుంచి తమ పశువులను రక్షించాలని ఆయన కోరారు.