ఎల్లారెడ్డి రూరల్/ బాన్సువాడ/ నిజాంసాగర్, జూన్ 2: అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నది. మండలంలోని సోమార్పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (16), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ (17), ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మధుకర్‌గౌడ్ (17) నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో గల్లంతయ్యారు. రాత్రి 9 గంటలైనా వారి ఆచూకీ లభించకపోవడంతో గజఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని సోమార్పేట గ్రామంలో 11 మంది యువకులు క్రికెట్ ఆడారు.
సాయంత్రం అందరూ కలిసి సోమార్పేట-నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గ్రామంలో మధ్య ఉన్న నిజాంసాగర్ బ్యాక్‌వాటర్ వద్దకు వెళ్లారు. స్నానం చేసేందుకు అందరూ నీళ్లలోకి దిగగా, ఈత వచ్చిన కొంతమంది ఈదుకుంటూ ముందుకు వెళ్లారు. కొద్దిలోతు వరకు వెళ్లిన హర్షవర్ధన్, నవీన్, మధుకర్ గౌడ్ బ్యాక్ వాటర్‌లో ఉన్న బురదలో చిక్కుకున్నారు. బయటికి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ హాహాకారాలు చేశారు. ఒడ్డుకు దగ్గరలో స్నానం చేస్తున్న మిగతా ఎనిమిదికి పెద్దగా ఈత రాదు. దీంతో వారు కూడా అరుస్తుండగానే ముగ్గురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు.
వెంటనే మిగతా యువకులు గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎల్లారెడ్డి, నిజాంసాగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో గజఈతగాళ్ల సాయంతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో పరిస్థితులు అనుకూలంగా లేవని పోలీసులు పేర్కొన్నారు. యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న యువకుల కుటుంబీకులు, గ్రామస్తులు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. గల్లంతైన యువకుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.