బోధన్, నవంబర్ 1: బోధన్ ప్రాంతంలో రహదారుల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు పనులను నిర్దేశిత గడువులోపు పూర్తిచేయాల్సి ఉండగా అంతులేని జాప్యం నెలకొంటున్నది. పనుల పూర్తికి గడువు పొడిగించడంతో సాధారణ జన జీవితానికి ఇబ్బందులు తప్పడంలేదు. అకాల వర్షాలతో రహదారుల విస్తరణ కోసం తవ్విన గుంతలు, రోడ్లపై పేరుకుపోయిన మట్టి, యంత్రపరికరాలతో రాకపోకలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బోధన్ మీదుగా మూడు జాతీయ రహదారులు ఏర్పడుతుండడంతో ప్రజలు సంతోషించారు. జాతీయ రహదారుల నిర్మాణం బోధన్ డివిజన్‌తోపాటు జిల్లా అభివృద్ధికి దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు.
నాలుగేండ్లుగా రహదారుల నిర్మాణ పనుల్లో పురోగతి కరువైంది. మద్నూర్ నుంచి బోధన్ మీదుగా భైంసా వెళ్లే జాతీయ రహదారి (161బీబీ) నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నది. ఈ జాతీయ రహదారి ప్రతిపాదన అనేక ఏండ్లుగా కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు 161బీబీ నేషనల్ హైవేకు 2022 నవంబర్‌లో ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారికి సంబంధించి సగం దూరం మేరకు ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం గమనార్హం. హైదరాబాద్ – అకోలా 161 జాతీయ రహదారి, నిర్మల్ జిల్లా భైంసాలోని 61వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానం చేయడానికి ఈ 161బీబీ నేషనల్ హైవేను 94.4 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు.
ఇందులో బోధన్ నుంచి పెగడాపల్లి, సాటాపూర్, ఫకీరాబాద్, బాసర మీదుగా భైంసా వరకు రహదారి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఫకీరాబాద్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం పూర్తికాలేదు. బోధన్ – భైంసా సెగ్మెంట్ వరకు రూ.544.4 కోట్లతో చేపట్టిన 56.4 కిలోమీటర్ల దూరం పనులు గత మార్చి వరకు పూర్తికావాలి. కానీ పనుల్లో వేగం లేకపోవడంతో రెండోసారి ఆరు నెలలపాటు గడువు పొడిగించారు. అయినప్పటికీ, పనులు కాకపోవడంతో మరో ఆరు నెలలు పొడిగించడంతో నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం నెలకొన్నది.
పనులు పూర్తయిన రహదారిపై సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఇదే రహదారిలో మద్నూర్ నుంచి పొతంగల్, కోటగిరి, రుద్రూర్ మీదుగా బోధన్ వరకు ఉన్న సెగ్మెంట్లో ఇప్పటి వరకు పనులు ప్రారంభంకాలేదు. నాలుగు లేన్ల రోడ్డుగా నిర్మించనున్న ఈ రహదారికి భూసేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. 38 కిలోమీటర్ల పొడువు కలిగిన ఈ రోడ్డు నిర్మాణానికి రూ.750 కోట్లు మంజూరుచేశారు. కానీ పనులు పూర్తయి, అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి బోధన్ వరకు 765డీ జాతీయ రహదారిగా మారిన రోడ్డు బాన్సువాడ నుంచి బోధన్ వరకు అధ్వాన్నంగా మారింది. ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్ని నుంచి రుద్రూర్ వరకు పనులు నెలలతరబడి కొనసాగుతుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అనేక చోట్ల డ్రైనేజీలు, కల్వర్టుల పనులు పూర్తికాలేదు. వాస్తవానికి బోధన్ వరకు ఉన్న ఈ జాతీయ రహదారి పనులను రుద్రూర్ వరకే ముగించారు. రుద్రూర్ – బోధన్ మధ్య మద్నూర్ నుంచి బోధన్ మీదుగా వెళ్లే 161బీబీ రహదారి పనుల్లో భాగంగా విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. పొతంగల్ – బోధన్ సెగ్మెంట్‌కు సంబంధించి పనులు ప్రారంభంకాకపోవడంతో బోధన్ – రుద్రూర్ మధ్య సుమారు 10 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభు త్వం జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మంజీర నది వంతెన వద్ద జిల్లాలోని సాలూర వద్ద తెలంగాణలోకి ప్రవేశించే బార్సీ – జగదల్పూర్ 63వ నంబర్ జాతీయ రహదారి పనులు కూడా ఐదేండ్లుగా నత్తనడకన సాగి ఇటీవలే పూర్తయ్యాయి. సాలూరా నుంచి బోధన్ మీదుగా నిజామాబాద్‌లోని కంఠేశ్వర్ వద్ద ప్రస్తుతం ఉన్న 63వ జాతీయ రహదారికి ఈ జాతీయ రహదారి కొనసాగింపుగా నిర్మించారు. సాలూరా – బోధన్ మధ్య బైపాస్ మొదట, చివరలో ఎటువంటి సూచికలు, రోడ్డు పక్కన ఉన్న పెద్ద పెద్ద గుంతల వద్ద రెయిలింగ్ ఏర్పాటుచేయలేదు. మరోపక్క జంక్షన్ల వద్ద అయోమయంగా ఉన్నదని, సక్రమంగా నిర్మాణం చేపట్టలేదని వాహనదారులు అంటున్నారు.