వినాయక్‌నగర్, అక్టోబర్ 17 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌కు చెందిన దాసరి కిషన్ (68), భార్య నాగమణి (55), కుమారుడు వంశీ (30) కుటుంబకలహాలతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ దాసరి కిషన్ అదేరోజు మరణించాడు.
అతడి భార్య నాగమణి, కుమారుడు వంశీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తరలించారు. గురువారం దాసరి వంశీ మరణించాడు. నాగమణి సైతం చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. తల్లిదండ్రులతోపాటు అన్న మృతిచెందడంతో చిన్న కుమారుడు బాలకృష్ణ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపారు.