Attack with bottle | వినాయక నగర్, ఆగస్టు 10 : మద్యం మత్తులో ఉండి ఓ యువకుడు సీసా పగలగొట్టి ముగ్గురిని పొడిచి గాయపరిచిన ఘటన నిజామాబాద్ రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుపన్ పల్లి ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘటన వివరాలను ఆదివారం పోలీసులు వెల్లడించారు. గోపనపల్లి గ్రామానికి చెందిన మదన్ అనే యువకుడు రాత్రి మద్యం సేవించి గ్రామంలోని ఓ కిరాణా షాపు షట్టర్ పక్కన నిద్రించాడు.
అదే సమయంలో అదే గ్రామానికి చెందిన శైలేందర్, అనిల్ ఇద్దరు యువకులు అక్కడికి రావడంతో మద్యం మత్తులో పడుకుని ఉన్న మదన్ కు వారి కాలు తగిలింది. దీంతో అగ్రహాంతో ఊగిపోయిన మదన్ అక్కడ ఉన్న కల్లు సీసా పగలగొట్టి ఆ ఇద్దరిని వెంబడించి ఆ సీసాతో దాడి చేసి వారిని గాయపరిచాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అనిల్ సహోదరి అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఆమెపై సైతం దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు గాయాల పాలవడంతో గ్రామస్తులు వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై దీపిక నిజామాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎహెచ్‌వో మహమ్మద్ ఆరిఫ్ మదన్‌పై అత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే దాడి ఘటన అనంతరం నిందితుడు గ్రామంలో లేడని పరార్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరార్ లో ఉన్న నిందితుడు కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.