బోధన్ రూరల్, ఫిబ్రవరి 20: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడం బోధన్, రెంజల్ మండలాల్లో తీవ్ర విషాదం నింపింది. తల్లిదండ్రులతోపాటు కొడుకు విద్యుత్ షాక్‌తో మృత్యువాత పడిన ఘటన బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. మృతులు రెంజల్ మండలం సా టాపూర్కు చెందినవారుకాగా..గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెంజల్ మండలం సాటాపూర్ గ్రా మానికి చెందిన గంగారాం (45)కు ఇద్దరు భార్యలు బాలమణి(40), ఎగవ్వ. వీరి కుటుంబం పందుల పెంపకంతో జీవిస్తున్నది. మొదటి భార్య బాలమణికి ఒక కొడుకు కిషన్(20), కూతురు ఉండగా ఆమెకు ఆరేండ్ల క్రితం వివాహమైంది.
రెండోభార్య ఎగవ్వకు కొడుకు (10), కూతురు (8) ఉన్నారు. గురువారం తెల్లవారుజామున గంగారాం, భార్య బాలమణి, కొడుకు కిషన్ కలిసి అడవి పందుల వేట కోసం బోధన్ మండలం పెగడపల్లి గ్రామశివారులోని పంట పొలాల వద్దకు వెళ్లారు. పొలంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ముగ్గురూ అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, టౌన్ సీఐ వెంకటనారాయణ ,బోధన్ రూరల్ ఏస్సై మశ్చేందర్ కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పొలంలో బురద ఉండడంతో మృతదేహాలను పోలీసులు భుజం మీద మోసుకొని బయటికి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పందుల వేట కోసం వెళ్లి చనిపోయారా? లేదా ఎందుకు వెళ్లారు? అనే విషయమై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
రెంజల్, ఫిబ్రవరి 20 : మండలంలోని సాటాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యుత్‌షాక్‌తో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. తల్లిదండ్రులతో పాటు కొడుకు మృత్యువాత
పడడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతోనే ముగ్గురు మృత్యువాత పడ్డారని మృతుల బంధువులు ఆరోపించారు.