వినాయక్‌నగర్, మే 25: ఎడపల్లి ఠాణా పరిధిలో వెలుగు చూసిన బాలికపై హత్యాయత్నం కేసులో మిస్టరీ వీడిపోయింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతో కన్నతల్లే కూతుర్ని హతమార్చేందుకు యత్నించినట్లు తేలింది. ప్రియుడితోపాటు మరో వ్యక్తి సహకారంతో ఆ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. ముగ్గురు నిందితులను శనివారం అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్ కట్టపై ఓ బాలిక శుక్రవారం అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను నిజామాబాద్ దవాఖానకు తరలించారు.
జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన సీపీ కల్మేశ్వర్ సింగేనవార్.. ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. అడిషనల్ డీసీపీ శేషాద్రినిరెడ్డి పర్యవేక్షణలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి చేపట్టిన దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బయటకొచ్చాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళకు, ఆటోడ్రైవర్ అల్తాఫ్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, తమ బంధానికి కూతురు అడ్డుగా ఉందని భావించిన సదరు మహిళ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది.
దీంతో ప్రియుడు, మరో వ్యక్తి ఆరిఫ్‌తో కలిసి ఆమె రెండ్రోజుల క్రితం ఆటోలో బాలికను తీసుకుని జాన్కంపేట్‌కు వెళ్లారు. అక్కడ బాలికపై విచక్షణారహితంగా దాడి చేశారు. చున్నీతో గొంతుకు బిగించి లాగారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను చూసి చనిపోయిందని భావించి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను గమనించిన స్థానికులు పోలీసుల సహాయంతో దవాఖానకు తరలించారు. మరోవైపు, సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఎడపల్లి నుంచి నిజామాబాద్ మార్గంలో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించారు. వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.