నిజామాబాద్, అక్టోబర్ 7, (నమస్తే తెలంగాణ ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కస్టం మిల్లింగ్ రైస్ గందరగోళంగా మారింది. 2024-25 వానాకాలం సీఎంఆర్ ఇప్పటికీ ముగియలేదు. గత యాసంగి సీజన్లో సేకరించిన ధాన్యాన్ని కేటాయించలేదు. కొత్తగా వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. సేకరించిన ధాన్యాన్ని ఏ గోదాముల్లో నిల్వ చేస్తారు? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఓ వైపు ఎఫ్‌సీఐ గోదాముల్లో బియ్యం నిల్వలు, రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలతో నిండుగా ఉండటంతో సమస్య జఠిలంగా మారింది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సోయి లేకుండా పోయింది. ఫలితంగా 2025-26 వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణలో అడుగడుగునా ఆటంకాలు తప్పేలా లేదు. సర్కారు తీరు వల్ల వేల సంచుల్లో ధాన్యం ముక్కి పోతోంది. నిజామాబాద్ జిల్లాలో 3.50లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 1.20లక్షల మెట్రిక్ టన్నులు యాసంగి ధాన్యం ఇప్పటి వరకూ కేటాయింపులు జరపలేదు. రైస్ మిల్లులకు చేరిన బస్తాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. విచిత్రమేమిటంటే యాసంగి సీఎంఆర్ గడువు అక్టోబర్ 31తో ముగుస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. ఎఫ్‌సీఐ గోదాముల్లో బియ్యం నిల్వలు ఎక్కడికక్కడ పేరుకు పోయాయి. ఎఫ్‌సీఐ నుంచి బియ్యం తరలించకపోవడంతో గోదాములు ఖాళీ అవ్వడం లేదు. గడువులోపు మిల్లింగ్ చేయకపోతే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానిప్పుడు సర్కారు లోపం వల్ల గడువు అనివార్యంగా పొడిగించాల్సిన దుస్థితి ఏర్పడింది.
రైస్ మిల్లర్లకు కేసీఆర్ హయాంలో స్వర్ణయుగంలా ఉండేది. మూసేసుకునే దౌర్భాగ్యకరమైన పరిస్థితి నుంచి కొత్తగా పెట్టుబడులు పెట్టి రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకుంది. కుప్పలు తెప్పలుగా ధాన్యం ఉత్పత్తి పెరగడంతో రైస్ మిల్లర్ల అవసరం పెరిగి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో కొత్తగా రైస్ మిల్లులు ఏర్పాటు అయ్యాయి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 252 రైస్ మిల్లులు, కామారెడ్డి జిల్లాలో 147 రైస్ మిల్లులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 399 రైస్ మిల్లులు నెలకొన్నాయి. ఇందులో పదుల సంఖ్యలో రైస్ మిల్లులు కేసీఆర్ హయాంలోనే నెల కొల్పబడటంతో పారిశ్రామిక వృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు సైతం పెరిగాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలన లో సీఎం ఆర్ ప్రక్రియ గందరగోళంగా సాగుతుండటంతో రైస్ మిల్లర్లు తంటాలు పడుతున్నారు. ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సవ్యంగా ప్రక్రియ సాగక పోవడంతో సందిగ్ధత ఏర్పడింది. దీనికి తోడుగా రైస్ మిల్లు లకు తరలించిన ధాన్యాన్ని కేటాయింపులు చేయకపోవడంతో రిస్క్‌లో పడి పోతున్నారు. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని నిల్వ చేసేందుకు తంటాలు పడుతున్నారు. 2024-25 వానా కాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ సేకరణ తుది దశకు చేరుకుంది. వానాకాలం కోటా పూర్తి చేసి యాసంగి సీజన్‌పై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉండగా గోదాములు నిండిపోవడం పౌరసరఫరాల శాఖ అధికారులకు సైతం తలనొప్పిగానే మారింది.
ధాన్యం సేకరణ ప్రక్రియను కాంగ్రెస్ పాలకులు గాలికి వదిలేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మంత్రి పదవి మాత్రం ఎవ్వరికీ దక్కలేదు. ఇన్ఛార్జీ మంత్రి ఆధ్వర్యంలోనే పాలన నడుస్తున్నప్పటికీ ధాన్యం సేకరణపై మంత్రి సీతక్క ఇప్పటి వరకు కన్నెత్తి చూడలేదు. యంత్రాంగంతో సన్నాహక సమావేశం నిర్వహించలేదు. వరి కోతలు మొదలైన ఈ సమయంలో శాఖల మధ్య సమన్వయాన్ని చక్కబెట్టడం లో, సమస్యలను గుర్తించి ప్రభుత్వ స్థాయిలో పరిష్కరిం చడానికి చొరవ తీసుకోవడానికి ప్రయత్నాలు కనిపించడం లేదు. కేసీఆర్ పాలనలో అడుగడుగున రివ్యూలు జరిగేవి. ఏ ఇబ్బంది వచ్చినా మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి చొరవ తీసుకుని సమస్యను నివారించేది. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణను విజయవంతంగా పూర్తి చేసేందుకు పాటుపడేది. కానిప్పుడు కాంగ్రెస్ పాలకుల్లో ఆ ఆసక్తి మచ్చుకూ కానరావడం లేదు.
యాసంగి సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. నెలాఖరుకు(అక్టోబర్ 31) కోటా పూర్తి చేయాల్సి ఉండగా గోదాములు లభ్యత లేకపోవడంతో గడువు పొడిగించే అవకాశం ఉంది. అనివార్య పరిస్థితిలో గడువు పొడిగించి సీఎంఆర్ రాబట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడాల్సిన వస్తోంది. యాసంగి సీజన్ మిల్లింగ్ ఇంకా పూర్తి కాలేదంటే ఈ వానాకాలం సీజన్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేందుకు పౌరసరఫరాల సంస్థ సిద్ధం అవుతోంది. ఇదంతా ఎక్కడికి తరలిస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. సేకరించిన మొత్తం ధాన్యం పురుగుల పాలవుతోంది. ఎలుకలు, పంది కొక్కులకు ఆహారంగా మారుతోంది. సర్కారు నిర్లక్ష్యం మూలంగా ప్రజా ధనం వృథా అవుతోంది. గత యాసంగి సీజన్‌కు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 3.50లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 1.20లక్షల మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ లేకపోవడంతో పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.మిల్లింగ్ కాకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం పక్కాగా కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్యం వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం చూపనుంది. రైతుల నుంచి కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తే దించుకునేందుకు సౌకర్యం లేకపోవడం భారీ సమస్య ఏర్పడే వీలుంది.