ప్రగతి పరుగులు తీయాల్సిందే. ప్రజా సంక్షేమానికి అది మూలాధారం అనేది అందరూ అంగీకరించే మాటే. అయితే అదే సమయంలో ప్రకృతి, పర్యావరణ సంరక్షణ మాటేమిటనేది కూడా ఆలోచించుకోవాలి. ఈ రెండింటి మధ్య సమతూకం సాధించుకోవడమే నేటి యుగపు ప్రధాన సమస్య. మొదటిది ఎంత అత్యవసరం అయినప్పటికీ రెండోది ధ్వంసం కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అండమాన్ – నికోబార్ దీవుల్లో చేపడుతున్న బృహత్తర అభివృద్ధి ప్రాజెక్టుకూ ఈ మాటలు వర్తిస్తాయి. నికోబార్ దక్షిణపు అంచున గలాథియా అఖాతం వద్ద దాదాపు రూ.80 వేల కోట్ల వ్యయంతో మెగా రేవు పట్టణం, పౌర-సైనిక విమానాశ్రయం, భారీ టౌన్షిప్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది.
భారత ప్రధాన భూభాగానికి తూర్పుగా 1,300 పైచిలుకు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవులు పర్యావరణపరంగా చాలా సున్నితమైనవన్న సంగతి తెలిసిందే. చిన్నపాటి మార్పులు తలపెట్టినా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఓ మెగా ప్రాజెక్టుకు సిద్ధం కావడమంటే సహజంగానే సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతాయి. ప్రాంతీయ పర్యావరణాన్ని సమూలంగా మార్చేసే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇదివరకే జారీ అయ్యాయి. తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పచ్చజెండా ఊపడంతో మరోసారి ఈ అంశంపైకి దేశం దృష్టి మళ్లింది.
భారత ప్రభుత్వం ఇది సరుకు రవాణా కేంద్రంగా మరో హాంకాంగ్ అవుతుందని చెప్తుండగా, వ్యతిరేకులు మాత్రం తీవ్రస్థాయిలో పర్యావరణ విధ్వంసం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కేంద్రం తలపెట్టిన ప్రాజెక్టుకు 244 చదరపు కిలోమీటర్ల భూమి కావాలి. అందులో 130 చదరపు కిలోమీటర్ల భూమి వర్షాధార అడవి కావడమే ఈ ఆందోళనకు మూలకారణం. కోటికి పైగా చెట్లను ప్రాజెక్టు కోసం నరికివేయబోతున్నారు. మారిన అటవీ చట్టాల మేరకు ఈ నష్టాన్ని మరోచోట భర్తీ చేస్తామని, ఇతోధికంగా మొక్కలు నాటుతామని అంటున్నది. గూడు చెదిరిపోయే మొసళ్లు, పగడపు దిబ్బలను సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలిస్తామని కూడా ప్రభుత్వం నమ్మ బలుకుతున్నది. ప్రాజెక్టు వల్ల పర్యాటకానికి, వ్యూహాత్మకంగా చేర్పు జరిగే మాట వాస్తవమే అయినప్పటికీ అందుకు చెల్లిస్తున్న మూల్యం చాలా ఎక్కువ అనేది పర్యావరణవాదుల అభ్యంతరం.
ప్రాజెక్టు వల్ల స్థానభ్రంశం పొందేది, సమస్యల పాలయ్యేది చెట్టూపుట్టా మాత్రమే కాదు. షోంపెన్, గ్రేట్ అండమానీస్ గిరిజనులకు నివాస ప్రదేశమైన చోట ఈ ప్రాజెక్టు తలపెట్టారు. దీనివల్ల అక్కడ కొత్తగా స్థిరపడబోయే జనాభా సుమారు ఆరున్నర లక్షలు. అదనంగా పర్యాటకుల సంఖ్యను ఏడాదికి పది లక్షల వరకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం అడవుల్లో జీవనం సాగిస్తున్న ఎనిమిది వేల మంది గిరిజనుల మనుగడ ఈ జనాభా విస్పోటనం ఫలితంగా తీవ్ర ప్రమాదంలో పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతుండటం గమనార్హం. చరిత్రలో ఇలాంటి జనాభా మిశ్రణం విపరీత పరిణామాలకు దారితీయడం తెలిసిందే. ఇప్పుడు అండమాన్ తెగలు కూడా రకరకాల వ్యాధుల బారిన పడి అవసాన దశకు చేరుకున్నా దిక్కులేదు.
సరుకు రవాణా కంటెయినర్ షిప్పుల రాకపోకలు భారీగా పెరుగుతాయి. రేవు, విమానాశ్రయం, టౌన్షిప్కు అవసరమయ్యే విద్యుత్తును స్థానికంగా గ్యాస్ ఆధారిత కేంద్రాల ద్వారానే పొందాలి. అండమాన్ నికోబార్ దీవుల్లో నదులు లేకపోవడమే అందుకు కారణం. అదనపు అవసరాలకు సౌరశక్తిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఈ ప్రాజెక్టు విషయంలో చూపిస్తున్న తొందరపాటు కూడా వివాదాస్పదం అవుతున్నది. ప్రపంచంలోనే పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించిన చోట ఇంతటి మెగా ప్రాజెక్టు కట్టడం ఉత్పాతాలకు ద్వారాలు తెరవడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. భూకంపాలు చోటుచేసుకునే చోట భారీ నిర్మాణాలు చేపట్టడం ఎంతవరకు సబబు? అనేది మరో ప్రశ్న.