పాలకుర్తి, మే 27 : ‘వర్షం వస్తున్నది.. వడ్లపై పరదా కప్పాలి’ అని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఓ రైతు పరదా అడిగినందుకు నిర్వాహకురాలి భర్త దాడి చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర లో బుధవారం చోటుచేసుకున్నది. దాడిని నిరసిస్తూ బస్‌స్టాప్ వద్ద పాలకుర్తి-స్టేషన్‌ఘన్‌పూ ర్ ప్రధాన రహదారిపై గంట పాటు రాస్తారోకో చేశారు. బమ్మెరకు చెందిన రైతు బత్తిని దేవయ్య నెల రోజుల క్రితం ఐకేపీ సెంటర్లో ధాన్యం పోశాడు. వర్షం వస్తుంది పరదా ఇవ్వాలని బుధవారం నిర్వాహకురాలు వీరలక్ష్మిని అడగగా, ఆమె భర్త గట్టయ్య దాడి చేశాడని బాధితుడు దే వయ్య చెప్పారు. నిర్వాహకురాలు పరదాలు ఎందుకు ఇవ్వరని తోటి రైతులు ఆమెను నిలదీశారు. రైతుపై దాడి చేసిన నిర్వాహకురాలు వీరలక్ష్మి, ఆమె భర్తపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను డిమాండ్ చేశారు.
దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బాధిత రైతు దేవయ్యను ఫోన్లో పరామర్శించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతు దేవయ్యపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.