మేడ్చల్, ఫిబ్రవరి16(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడుచింతలపల్లి, ఎల్లంపేట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నిక పక్రియలో మూడుచింతలపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌గా జామురవి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా లావుడియా శ్రీదేవి ఎన్నికయ్యారు. మూడుచింతలపల్లిలో 24 వార్డులకుగాను 14 వార్డులు బీఆర్ఎస్, కాంగ్రెస్ 9 వార్డులు, 1 వార్డు బీజేపీ గెలుపొందగా, ఎల్లంపేట్లో 24 వార్డులకు గాను 12 వార్డులు బీఆర్ఎస్, 8 వార్డులు కాంగ్రెస్, 4 వార్డులు బీజేపీ గెలుపొందింది. మూడుచింతలపల్లి వైస్ చైర్ పర్సన్‌గా శశిరేఖ, ఎల్లంపేట్ వైస్ చైర్ పర్సన్‌గా రజిత ఎన్నికయ్యారు.
సంబురాల్లో బీఆర్ఎస్
రెండు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. చైర్మన్లకు బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి స్వాగతం పలికారు. పూలదండలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిసి ఆశ్వీరాదం తీసుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్లకు మల్లారెడ్డి అభినందించారు. గెలుపొందిన వార్డు సభ్యులు చైర్పర్సన్లు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. బీఆర్ఎస్కు ప్రజల నుంచి ఆదరణ ఉన్నందువల్లే రెండు మున్సిపాలిటీల్లో భారీ విజయం సాధించామని మల్లారెడ్డి తెలిపారు. …వివరాలు IV లో
మేడ్చల్, ఫిబ్రవరి 16:మేడ్చల్-మల్కాజిగిరిలోని రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నామ ంటే ప్రజల ఆశ్వీరాదమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. రెండు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్లుగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సేవలను ప్రజలు మరిచిపోలేదన్నారు. గెలుపొందిన వార్డు సభ్యులు, చైర్మన్లు ప్రజలకు సేవ చేయడంలో ముం దుండాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన బీఆర్ఎస్ వార్డు సభ్యులను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ అనైతిక పొత్తు..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య అనైతిక పొత్తు బలపడింది. అలియాబాద్ మున్సిపాలిటీ బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ వశమైంది. బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వగా కాంగ్రెస్ అభ్యర్థి అయిన కంఠం శిరీషను చైర్ పర్సన్‌గా ఎన్నుకున్నారు. అలియాబాద్ మున్సిపాలిటీకి 20 వార్డులు ఉండగా 8 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 3 బీజేపీ, 2 ఇతరులు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 11 కాగా కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు ఇచ్చింది. బీజేపీ వైస్ చైర్ పర్సన్‌గా కన్రెడ్డి మాలతి దక్కించుకున్నది.