నవీపేట, మే 20: మండలంలోని గాంధీనగర్‌లో సోమవారం అర్ధరాత్రి ముసుగులు ధరించి, చేతుల్లో కత్తులు పట్టుకొని వచ్చిన దొంగలు హల్చల్ చేశారు. ఓ కిరాణా షాపు తాళాలు పగుల గొట్టి రూ.ఐదు రుపాయల నాణేలు దొంగిలించుకొని పారి పోయారు. సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలు రికార్డయ్యాయి.
కిరాణా షాపు యజమాని సుదర్శన్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. గాంధీనగర్‌లో సుదర్శన్‌రెడ్డి కిరాణాషాపులో దోపిడీకి పాల్పడేందుకు ఎనిమిది మంది దొంగలు నిక్కర్లు, ముఖానికి ముసుగులు ధరించి కత్తులతో వచ్చారు. షాపులో చోరీకి పాల్పడేందుకు గ్రామంలోకి సోమవారం అర్ధరాత్రి 1:10 గంటలకు వచ్చారు. రోడ్డు పై 20 నిమిషాల పాటు కత్తులతో అటూ ఇంటూ తిరుగుతూ హల్చల్ చేశారు.
చివరికి సుదర్శన్‌రెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి ఐదు రూపాయల చిల్లర నాణేలు మాత్రమే దొంగిలించుకొని పారి పోయారు. మంగళవారం ఉదయం సుదర్శన్‌రెడ్డి భార్య వాకిలి ఊడ్చేందుకు బయటికి రాగా షాపు తలుపులు పగులగొట్టి ఉన్నాయి. ఆందోళనకు గురైన ఆమె తన భర్త కు సమాచారం అందించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని ఎస్సై వినయ్ పేర్కొన్నారు.