వినాయక నగర్, జూన్ 09 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఇల్లు గుళ్ల చేశారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ అధికారి ఇంటికి తాళం వేసి ఉండడంతో మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు దోపిడీ దొంగలు ద్విచక్ర వాహనం పై వచ్చి తాళం పగులగొట్టి బంగారు నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులు వస్తువులతో పాటు లాకర్‌ను ఎత్తుకెళ్లారు.
ఈ క్రమంలో ఉదయాన్నే పనిమనిషి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో వెంటనే మూడవ టౌన్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ హరిబాబు సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లాకర్లో సుమారు 30 తులాల వరకు బంగారు నగలు, కొంత నగదు ఉన్నట్లు తమకు తెలిసిందని, బాధితుడు వచ్చి ఫిర్యాదు చేసిన చేసినా అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ హరిబాబు తెలిపారు.