పోతంగల్ ఏప్రిల్ 29: నిజామాబాద్ (Nizamabad) జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుట్టి రాములు.. వేసవి కాలం కావడంతో రోజూ రాత్రిపూట మిద్దెపై నిద్రిస్తున్నారు. రోజూలానే సోమవారం రాత్రి కూడా రాములు కుటుంబ సభ్యులు ఇంటిపై పడుకున్నారు. అయితే మంగళవారం తెల్లవారి లేచి చూసేసరికి ఇంటి డోర్లు తెరిచి ఉండటంతో అవాక్కయ్యారు. లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండటాన్ని గమనించారు. అందులో సుమారు 5 తులాల బంగారం, 2 తులాల వెండితోపాటు ఇంటి ముందు నిలిపిన ద్విచక్ర వాహనం కనిపించలేదు. వెంటనే కోటగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.