Govt Junior Colleges | నాగిరెడ్డిపేట, జూన్ 23 : నలభై ఏండ్ల కల నెరవేరిందని సంబురపడాలో.. కనీస వసతులు లేక బాధపడాలో..తెలియని స్థితిలో నాగిరెడ్డిపేట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. చిరకాల స్వప్నం అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాల గతేడాది అప్పటి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మంజూరు చేయించారు. మండల కేంద్రంలోని గోపాల్పేట ఉన్నత పాఠశాలలో తరగతులను ప్రారంభించారు. కళాశాల కోసం సమీపంలోని మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ పక్కన రెండు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఒక్క గదిని మాత్రమే కేటాయించడంతో ఒక టేబుల్, రెండు కుర్చీలతో కళాశాల కొనసాగుతున్నది. కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్‌కు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాలలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడం, గదుల కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో కళాశాల గదిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నట్లు కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్పందించి కళాశాలను కాపాడుకోవడానికి కృషి చేయాలని కోరుతున్నారు.
కళాశాల మంజూరైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క తరగతి గది కూడా ఏర్పాటు చేయలేదు. ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ హేమచందర్ను నియమించగా ఇటువైపు కన్నెత్తి చూసిందీ లేదు. అదే కళాశాలకు చెందిన జూనియర్ లెక్చరర్ నాగయ్యను ఇక్కడికి డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. ఒక అటెండర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో కళాశాల నిర్వాహణ తూతూ మంత్రంగా ముందుకు సాగుతున్నది.
జూనియర్ కళాశాల ఉన్నట్లు అధ్యాపకులు ప్రచారం చేయకపోవడంతో అసలు మండలంలో కళాశాల ఉన్నట్లు కూడా మరిచిపోయారు. అన్నీ ఉచితంగా అందించి, స్కాలర్షిప్ సౌకర్యం ఉన్నా సరైనా సమాచారం ఇచ్చే వారు లేక అప్పులు చేసి మరి ప్రైవేట్ కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కళాశాలలో తెలుగు, ఆంగ్లం భాషలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో బీపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీలో ఒక్కో తరగతికి 80 మందికి పైగా విద్యార్థులకు గాను ఇప్పటి వరకు కేవలం 56 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. పరిస్థితి ఇలానే కొనసాగితే కళాశాల నిర్వాహణ కష్టమేనని పలువురు విద్యావంతులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
కళాశాల మంజూరు చేసి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు కళాశాలలో కనీస వసతులు, గదులు లేవు. తమ పిల్లలను చేర్పించాలంటే కనీసం గది, బెంచీలు కూడా లేవు. పిల్లలు చేరేందుకు ఇష్టపడడం లేదు. ఎన్నో సంవత్సరాల ఎదురుచూపులతో వచ్చిన కళాశాల కనీస ఏర్పాట్లు లేకుండా అలంకారప్రాయంగా ఉండడం బాధగా ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వసతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి.
కళాశాలలో తరగతి గదులు, వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వసతులు లేక ముందుకు వెళ్లలేకపోతున్నాం. విద్యార్థులు ఇక్కడికి వచ్చి చూసి ఏమీ కనిపించపోవడంతో..జాయిన్ కావడం లేదు. జూలై 1 నుంచి తరగతులను ప్రారంభించాలని అనుకుంటున్నాం. వసతులు కల్పిస్తే..విద్యార్థులకు మంచి కళాశాలగా మారుతుంది. విద్యార్థులు చేరితేనే అధ్యాపకులు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవతీసుకొని ఏర్పాట్లపై కృషి చేస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది.