గాంధారి, డిసెంబర్ 21: తండ్రి, కొడుకు మధ్య డబ్బుల విషయంలో మొదలైన గొడవ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కోపంలో కుమారుడిపై కత్తితో దాడి చేసి చంపేసిన తండ్రి.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్జుల్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై ప్రేమ్‌దీప్, స్థానికులు తెలిపిన ప్రకారం.. పెద్ద గుజ్జుల్ తండాకు చెందిన బదావత్ వసంత్‌రావు(48)కు ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య కుమారుడు బదావత్ సురేశ్ (27) ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లి ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే, దుబాయ్ నుంచి పంపించిన డబ్బలు విషయంలో బుధవారం రాత్రి తండ్రి, కొడుకు మధ్య వాగ్వాదం జరిగింది.
మద్యం మత్తులో వసంత్‌రావు.. కుమారుడి ఛాతిలో పొడవడంతో సురేశ్ కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు అతడ్ని గాంధారిలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు, కొడుకుపై దాడి చేసిన వసంత్‌రావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగడంతో అతడ్ని నిజామాబాద్‌లోని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు.