బాన్సువాడ/పెద్ద కొడప్గల్, నవంబర్ 8: కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి రచ్చకెక్కింది. బాన్సువాడ హస్తం పార్టీలో బుధవారం ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సీనియర్లను కాదని పారాచూట్లకు పెద్దపీట వేయడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసమ్మతి, అసంతృప్తి వెల్లువెత్తింది. ఏండ్ల నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న తమను కాదని కొత్త వారికి టికెట్లు ఇవ్వడంపై సీనియర్ నాయకుడు కాసుల బాలరాజు మనస్తాపానికి గురయ్యారు. హస్తం పార్టీ తీరును నిరసిస్తూ ఆమరణ దీక్షకు కూర్చున్న కాసుల.. అంతలోనే ఆత్మహత్యాయత్నం చేశారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక బుధవారం తన ఇంట్లో పురుగుల మందు తాగారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, అనుచరులు వెంటనే బాన్సువాడ దవాఖానకు, అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మరోవైపు, కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గంగారాం.. జుక్కల్ నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. సీనియర్లకు మొండి‘చేయి’ చూపి, ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు కేటాయించడంపై హస్తం నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు.
బాన్సువాడ టికెట్‌ను ఆశించిన కాసుల బాలరాజుకు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపింది. ఇటీవలే బీజేపీ నుంచి పార్టీలోకి వచ్చిన ఎల్లారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కాసుల ఆత్మహత్యాయత్నం చేశారు. బాన్సువాడలోని తన నివాసంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. పదేండ్లుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి పోరాటాలు చేసిన తనను కాదని, ఎక్కడి నుంచో వచ్చిన ఏనుగు రవీందర్‌రెడ్డికి టికెట్ కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన తనకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ తీరును నిరసిస్తూ ఇంట్లోనే ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలతో కలిసి దీక్ష ప్రారంభించారు. అయితే టాయిలెట్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్లిన కాసుల.. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు, అనుచరులు ఆయనను బాన్సువాడ ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కాసులను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలరాజు త్వరగా కోలుకోవాలని భాస్కర్‌రెడ్డి ఆకాంక్షించారు. అయితే, వైద్యుల సూచన మేరకు కాసులను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా, 24 గంటలు గడిస్తేగాని ఆయన ఆరోగ్యం గురించి ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు ఎస్సీ కాదని, బీసీ అని చెప్పారు. పెద్దకొడప్గల్ మండలంలోని తన నివాసంలో గంగారాం బుధవారం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోరిక మేరకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కార్యకర్తల ఆశీర్వాదంతోనే నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యానన్నారు. కార్యకర్తల నిర్ణయంతోనే కాంగ్రెస్ పార్టీ తరఫున, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేస్తామన్నారు. కాంగ్రెస్ తరఫున ఎందుకంటే లక్ష్మీకాంతారావు ఎస్సీ కాదు బీసీ అని వెల్లడించారు.