నిజామాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆర్మూర్ మున్సిపాలిటీలో సంక్షోభం నెలకొంది. కొత్త చైర్మన్‌ను ఎన్నుకోకపోవడంతో పాలన స్తంభించింది. అవిశ్వాసం నెగ్గి 20 రోజులు పూర్తయినా నూతన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఓవైపు తెర వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడి, మరోవైపు అధికార యంత్రాంగం తీరుతో ఎన్నికలో జాప్యం జరుగుతున్నది. కౌన్సిలర్ల విశ్వాసం కోల్పోవడం మూలంగా చైర్పర్సన్ వినీత పదవీచ్యుతులయ్యారు. ఈ ఘటన జరిగి దాదాపుగా మూడు వారాలు కావొస్తుంది. అయినప్పటికీ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తున్నది.
పండిత్ వినీతపై కౌన్సిలర్లు కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసులు అందించారు. దీంతో జనవరి 4న ఆర్మూర్ ఆర్డీవో అధ్యక్షతన అవిశ్వాస ప్రక్రియ జరిగింది. మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా 24 మంది అవిశ్వాస సమావేశానికి హాజరై పండిత్ వినీతకు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో వినీత పదవి కోల్పోయారు. తదనంతరం ఆర్డీవో నుంచి వచ్చిన నివేదిక సారాంశాన్ని అనుసరించి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదికను పంపించారు. అయితే, నూతన చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉండగా, ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
ఆర్మూర్ మున్సిపాలిటీలో ప్రజల చేత ఎన్నికైన పాలకమండలి మనుగడలోనే ఉంది. కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా ఉన్నది. కౌన్సిలర్ల అభీష్టం మేరకు నూతన చైర్మన్ నియామకం చేపట్టక పోవడం ద్వారా కార్యనిర్వాహక వ్యవస్థ చేతిలోకి పాలన పగ్గాలు వెళ్తున్నాయి. తద్వారా ప్రజా ప్రతినిధుల అధికారాలు, వారు నిర్వర్తించాల్సిన విధులు సుప్తావస్థకు చేరుకున్నట్లుగా మారింది. చట్టాన్ని గౌరవించాల్సిన వాళ్లే చిన్న చిన్న సాంకేతిక కారణాలను చూపి చైర్మన్ ఎన్నికను పక్కన పెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అవిశ్వాస సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సైతం పాల్గొన్నారు. ఒకవేళా ఆయన ఓటు హక్కు విషయంపై అభ్యంతరాలు ఉంటే పురపాలక శాఖ త్వరగా తేల్చాలి. కానీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఈ అంశాన్ని తొక్కి పెట్టినట్లు అర్థమవుతున్నది. ఎమ్మెల్యే ఓటుతో పురపాలక చైర్మన్ అవిశ్వాస తీర్మానం ఓడిపోయే అవకాశం కూడా లేదు. ఎందుకంటే 36 మందిలో 24 మంది కౌన్సిలర్లు ఏకపక్షంగా అవిశ్వాసాన్ని బలపర్చారు. అయినప్పటికీ ఏదో సాంకేతిక కారణం చూపి చైర్మన్ ఎన్నిక ఆపడంపై గందరగోళం నెలకొన్నది. ఆర్మూర్‌లో జరిగిన అవిశ్వాస తీర్మాన సమావేశం అనంతరం రాష్ట్రంలో అనేక చోట్ల అవిశ్వాసాలు జరిగాయి. అక్కడ చైర్మన్ ఎన్నికలు సైతం ముగిసినా ఇక్కడ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రస్ఫుటం చేస్తున్నది.
ప్రభుత్వ పనితీరుకు అధికార యంత్రాంగం పనితీరు దర్పణంగా నిలుస్తుంది. ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. కారణాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కౌన్సిలర్ల విశ్వాసాన్ని కోల్పోయిన చైర్పర్సన్ స్థానంలో చట్టబద్ధంగా కొత్తవారిని ఎన్నుకునేందుకు పురపాలక సమావేశం నిర్వహించాలి. కానీ ఈ వ్యవహారంలో మాత్రం తాత్సారం జరుగుతుండడం విడ్డూరంగా మారింది. ఈ తతంగం వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు కౌన్సిలర్లు చెబుతున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి బలమే లేదు. కేవలం ఒకే ఒక కౌన్సిలర్ ఉన్నారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ఆర్మూర్ బల్దియాలో చోటు చేసుకున్న పరిణామాలను సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులకు వత్తాసు పలుకకుండా చట్టం ప్రకారం పని చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండడంతో బల్దియాలో పాలన స్తంభించింది.