సర్కార్ బడులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, సత్ఫలితాలు ఇవ్వడంలేదు. గ్రామీణ విద్యార్థుల కోసం అందుబాటులో పాఠశాలలను ఏర్పాటు చేసినా కొన్నిచోట్ల అవి తూతూ మంత్రంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులుంటే టీచర్ల కొరత ఉండడం, ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు లేకపోవడం వంటి పాఠశాలలు మండలంలోని పలు గ్రామాలు, తండాల్లో కనిపిస్తున్నాయి.
-ఎల్లారెడ్డి రూరల్, జనవరి 31
మండలంలోని హాజీపూర్ సడాక్తండా ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు. నాల్గో తరగతిలో ఉన్న విద్యార్థిని సభావట్ సింధు పాఠశాలకు వస్తుండగా, ఒకటో తరగతిలో ఉన్న సభావట్ మహేశ్వరి అప్పుడప్పుడు వస్తున్నది. సదరు బాలిక మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులి మనవరాలు కావడంతో ఆలస్యంగా వస్తున్నది.
పాఠశాలలో ఇద్దరే విద్యార్థినులు ఉండడంతో ఏజెన్సీ నిర్వాహకురాలు సభావట్ షానుబాయి ఇంటి నుంచే భోజనం తీసుకువస్తున్నది. దీంతో పాఠశాలలోని కిచెన్, స్టోర్ గదులు నిరుపయోగంగా మారాయి. ఈ విషయమై ఉపాధ్యాయురాలు సుమలతను అడుగగా తాను ఆరు నెలల క్రితం బదిలీపై వచ్చానని, లింగంపేట్ నుంచి ప్రతిరోజూ పాఠశాలకు వస్తూ పోతుంటానని తెలిపారు. తాను వచ్చిన నుంచి ఇదే పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. గ్రామంలో ఇద్దరే పిల్లలు ఉన్నారా, మిగతా పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు అని అడుగగా, గ్రామంలో ఇంకా పిల్లలు ఉన్నారని, సమీపంలోని హాజపూర్ గ్రామ పాఠశాలలో చదువుకుంటున్నారని తెలిపారు.