రుద్రూర్, జనవరి 18: రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్న తీరుపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడితో అర్హులకు కాకుండా అనర్హులకు ప్రభుత్వ పథకాలు దక్కేలా చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సర్వేకు వస్తున్న అధికారులపై స్థానికులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రుద్రూర్ మండలంలోని సులేమాన్నగర్లో రేషన్ కార్డుల సర్వేపై గ్రామస్తులు శనివారం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల సర్వేను సక్రమంగా నిర్వహించడం లేదని కార్యదర్శిని నిలదీశారు. ఎన్నో ఏండ్లుగా గ్రామంలో నివాసముంటున్న తమ పేర్లు జాబితాలో లేవని, కానీ మహారాష్ట్ర నుంచి ఇటీవల వచ్చి నివాసముంటున్న పేర్లు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల సర్వేను సక్రమంగా నిర్వహించాలని, స్వగ్రామంలో ఉంటున్న వారికే కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.