పసుపుబోర్డు మరోమారు తెరపైకి వచ్చింది. అది వచ్చింది లేదు, పోయింది లేదు కానీ సోషల్‌మీడియాలో మాత్రం బోర్డు ఏర్పాటుచేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ కావాలనే ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తున్నది. తనను గెలిపిస్తే ఐదు రోజుల్లోనే బోర్డు తెస్తానని ఎంపీ అర్వింద్ హామీ ఇచ్చి రైతుల ఓట్లు దండుకున్నాడు. ఐదేండ్లు దగ్గరకొస్తున్నా బోర్డు ఏర్పాటైందీ లేదు.. రైతుకు మేలు జరిగిందీ లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో బీజేపీ మళ్లీ అన్నదాతలను మోసం చేసే ప్రయత్నాలకు తెరలేపింది. ఫలితంగానే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
నిజామాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా తప్పుడు ప్రచారం జరగడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో బుధవారం వైరల్ అయ్యింది. కానీ ఎక్కడా అధికారికంగా ప్రకటన రాలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది మరో నాటకమని రైతులు మండిపడుతున్నారు. 2019లో ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన బీజేపీ నాలుగున్నరేండ్లు గడిచినా మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికలు సమీపిస్తుండడంతో మరో నాటకానికి తెర లేపింది. అతీగతీలేని పసుపు బోర్డు అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చి ఇదిగో వచ్చేసిందంటూ తమ వర్గాలతో ప్రచారం చేయించుకుంటుండడంపై ప్రజలు మండిపడుతున్నారు.
పసుపు బోర్డు అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుమంతైనా అధికారిక సమాచారం రాలేదు. పైగా ఎక్కడా ఈ అంశంపై అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ వచ్చేసిందోచ్ అంటూ బీజీపీ వర్గాలు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుండడంపై జనామంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో బీజేపీ చేతిలో మోసపోయిన పసుపు రైతులంతా ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ వారి చేతుల్లో మోసపోయేందుకు సిద్ధంగా లేమంటూ ప్రకటిస్తున్నారు. నాలుగున్నరేండ్లుగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిన ఎంపీ అర్వింద్‌ను అడుగడుగునా నిలదీసిన రైతులంతా వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ తగిన విధంగా బుద్ధి చెబుతామంటూ ఇప్పటికే ప్రకటించారు.
ఆది నుంచి బీఆర్ఎస్ పోరాటం
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఈనాటిది కాదు. ఏకంగా 40 ఏండ్ల క్రితం నుంచి ఈ ప్రాంత పసుపు రైతులు కోరుతున్నదే. 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కల్వకుంట్ల కవిత ఈ అంశంపై తీవ్రంగా శ్రమించారు. తాను పదవిలో ఉన్న ఐదేండ్లలో అనేక మార్లు ప్రధాని నరేంద్ర మోదీ, నాటి వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసి పసుపు బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ఒక దశలో కవిత చేస్తోన్న పోరాటంపై కేంద్రం స్పందించి ఎక్స్టెన్షన్ కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం కదిలి వచ్చింది.
పసుపు బోర్డు తప్ప ఇతరత్రా ఏ ప్రత్యామ్నాయాలు తమకు ఆమోదయోగ్యం కాదంటూ కవిత తిరస్కరించారు. నాటి ఎక్స్టెన్షన్ కార్యాలయాన్నే బీజేపీ ఎంపీ తాను తీసుకు వచ్చానని గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారు. ఎక్స్టెన్షన్ కార్యాలయం ఏర్పాటు చేసి చేతులు దులుపుకోగా తాజాగా అబద్ధపు ప్రచారంతో మరింతగా దిగజారుడు రాజకీయానికి పాల్పడడం ఏమిటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తీరు రాష్ర్టానికో ఎజెండా… పూటకో మాట అన్నట్లుగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణలో పసుపు బోర్డు తీసుకు వస్తామని హామీ ఇచ్చిన బీజేపీ పెద్దలే అందుకు ససేమిరా అన్నారు.
రాజ్యసభ, లోక్‌సభల్లో వేర్వేరుగా తెలంగాణకు చెందిన ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పసుపు బోర్డు పెట్టేది లేదన్నారు. కానీ అదే బీజేపీ ప్రభుత్వం గత తమిళనాడు ఎన్నికల్లో మాత్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ అక్కడి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏకంగా మ్యానిఫెస్టోలో పెట్టి ద్వంద్వనీతిని బయట పెట్టుకున్నది. అయినప్పటికీ రైతులెవ్వరూ బీజేపీని నమ్మలేదు. కర్ణాటక ఎన్నికల్లోనూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడి పసుపు రైతులపై ఉన్నట్టుండి ప్రేమను ఒలకబోసినా ఓట్లు రాల్చలేదు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చిన హామీని నిజాయితీగా నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోగా అసంబద్ధమైన ప్రచారంతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు.
తప్పుడు ప్రచారంతో గిమ్మిక్కులు
తనను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో తెస్తానని చెప్పిన పసుపు బోర్డు దాదాపుగా ఐదేండ్లు దగ్గర పడుతున్నా అతీగతి లేదు. అలాంటి బోర్డు ఏర్పాటు ఇక అయిపోయిందంటూ బీజేపీ వర్గాలు తెగ ప్రచారం చేసుకుంటుండడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. బుధవారం ఒక వెబ్ టీవీ ఛానల్లో, సోషల్ మీడియాలో కాషాయ పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రజలను గందరగోళానికి గురి చేసే విధంగా ప్రయత్నిస్తుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు కొద్ది కాలంలోనే సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దరిమిలా బీజేపీ శక్తులే కావాలని ఇదంతా చేస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు.
ఏడాదిన్నర క్రితమే రాజ్యసభ, లోక్‌సభల్లో పసుపు బోర్డు ఏర్పాటు ఆలోచనే లేదంటూ స్పష్టమైన ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం… ఏ విధంగా ముందడుగు వేస్తుందనే ప్రశ్నగా మారింది. ఇచ్చేది లేదు… వచ్చేది లేదు… ఇదంతా ఎన్నికల గిమ్మిక్కు తప్ప మరొకటి లేదంటూ పసుపు రైతులు కొట్టి పారేస్తున్నారు.
చేయని పనులను చేసినట్లుగా చెప్పుకునే బీజేపీకి ఇదంతా రివాజుగా మారిందంటూ మండిపడుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్న రైతులను ఏనాడూ పట్టించుకోని ఎంపీ అర్వింద్ సరిగ్గా ఎన్నికల సమయానికి ఆడుతోన్న రాజకీయ డ్రామాగానే అంతా భావిస్తున్నారు.