నిజామాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి జిల్లాలో వరద గాయం మానడం లేదు. ప్రభుత్వం పట్టింపు లేనితనం వల్ల వరద సృష్టించిన విలయాన్ని తలచుకుంటూ ప్రజానీకం విలవిల్లాడుతున్నారు. కామారెడ్డి పట్టణంలో శిథిలాలు ఇందుకు సజీవ సాక్షంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపులేని తనం మూలంగా జనాలంతా ఇబ్బందుల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. తూతూ మంత్రంగా వరద సాయాన్ని అందించి చేతులు దులుపుకున్నారు.
శాశ్వత ఏర్పాట్లు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నాలుగు నెలలు అవుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు విలువ లేకుండా పోయింది. స్వయంగా ఇద్దరు మంత్రులను వెంటేసుకుని కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కలియ తిరిగినప్పటికీ సీఎం హామీల అమలు కేవలం మాటలకే పరిమితమైంది. వరద గాయానికి సర్కారు నుంచి సరైన పరిష్కారమే లేకపోవడంపై ప్రజలంతా దుమ్మెత్తి పోస్తున్నారు. పురపాలక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధం అవుతోన్న దరిమిలా వరద బాధితుల్లో ఆక్రోషం కట్టలు తెంచుకుంటోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతాం అంటూ శపథం చేస్తున్నారు.
రూ.251.36కోట్లు వరద నష్టం…
కామారెడ్డి జిల్లాలో ఆగస్టు 26 నుంచి 29వరకు భారీ వరదలు తలెత్తాయి. కనీవినీ ఎరుగని విధంగా కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాలతో అపార నష్టం వాటిల్లింది. వరదల వల్ల రూ.251.36 కోట్లు నష్టం సంభవించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కూడా సమర్పించింది. సెప్టెంబర్ 4న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలంతో పాటుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు, కల్కినగర్ కాలనీల్లో పర్యటించారు. వరద నష్టం అంచనాకు అక్టోబర్ చివర్లో కేంద్ర బృందాలు సైతం క్షేత్ర స్థాయికి వచ్చి పరిశీలన చేశాయి. వరద సృష్టించిన విలయ తాండవానికి సరిగ్గా నాలుగు నెలలు అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం పైసా రాలేదు. దెబ్బతిన్న మౌళిక సదుపాయాలు ఎక్కడికక్కడే శిథిలాలుగా మారి దర్శనం ఇస్తున్నాయి.
కామారెడ్డి పట్టణమంతా శిథిల దిబ్బలతోనే కనిపిస్తోంది. కామారెడ్డి – హైదరాబాద్ రోడ్డులో కూలిన డివైడర్లతో కళావిహీనంగా మారినప్పటికీ మరమత్తులు కరువైంది. ఇసుక మేటలతో వేలాది ఎకరాలు పంట పొలాలు ధ్వంసమవ్వగా 33శాతం మేర దెబ్బతిన్న పంటలకు మాత్రమే సాయం చేసేందుకు నివేదికలను వ్యవసాయ శాఖ రూపొందించింది. కానీ రైతులకు సాయం మాత్రం అందలేదు. వరదలు, విపత్కార పరిస్థితులు తలెత్తిన సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశంలో కామారెడ్డి జిల్లా మోడల్‌గా నిలవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం కేవలం డాంభికాలకే పరిమితమైందంటూ ప్రజలంతా మండిపడుతున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేలకు పట్టింపు లేదా?
కామారెడ్డి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతారావులు ఇద్దరు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా, బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, మరొకరు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. పోచారం, షబ్బీర్ అలీలు ప్రభు త్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రకృతి సృష్టించిన విలయంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలతో పాటుగా కొద్ది ప్రాంతం బాన్సువాడ నియోజకవర్గం సైతం దెబ్బతిన్నది. వరద నష్టాన్ని పూడ్చేందుకు సర్కారు నుంచి నిధులు రాబట్టేందుకు వీరిలో ఎవ్వరూ శ్రద్ధ తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని జనాలంతా మండిపడుతున్నారు.
ఎమ్మెల్యేలకు పట్టింపు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. సీఎం స్వయం గా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి హామీలిచ్చినప్పటికీ ఫలితం లేకపోతే ఎలా? అని జనాలు నిట్టూరుస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా సురేష్ షెట్కార్ ఉన్నారు. కామారెడ్డి జిల్లా అంతటా ఇతని పరిధిలోకే వస్తుంది. కేంద్ర సాయంపై రేవంత్ రెడ్డి నివేదికలు సమర్పించి మిన్నకుండి పోగా కాంగ్రెస్ ఎంపీలు ఈ విషయంపై పోరాటం చేయకపోవడం విడ్డూరంగా మారింది. కాంగ్రెస్‌కు 8 మంది ఎంపీలున్నప్పటికీ ఫలితం లేకపోగా కామారెడ్డికి సైతం కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడే ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రయోజనం ఒరిగిందేమి లేదు.